దీదీ ఇదేంది?

May 14, 2019


img

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, బిజెపికి మద్య ఇంతకాలం జరుగుతున్న వాగ్వాదాలు నేడు పరస్పరం భౌతికదాడులు చేసుకొనేవరకు వెళ్లింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాలనుకొంటే, తృణమూల్ ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించింది. అమిత్ షా హెలికాప్టర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. దీనిని సవాలుగా భావించిన అమిత్ షా అనుమతి లేకపోయినా మంగళవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

అమిత్ షా ర్యాలీని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి, బిజెపి ఏర్పాటు చేసుకొన్న ఫ్లెక్సీ బ్యానర్లను చించివేశారు. ‘అమిత్ షా గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో ఆయన వెంట ఉన్న బిజెపి కార్యకర్తలు కూడా రెచ్చిపోయి వారిపై దాడి చేశారు. అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలపై రాళ్ళు రువ్వడంతో బిజెపి కార్యకర్తలు కూడా తిరిగి రాళ్ళు రువ్వారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఇరుపార్టీలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు పరస్పరం రాళ్ళతో దాడులు చేసుకొంటుంటే పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. దాంతో తృణమూల్ కార్యకర్తలు మరింత చెలరేగిపోయి బిజెపి ర్యాలీలో పాల్గొంటున్న వాహనాలపై దాడి చేసి కొన్నిటికి నిప్పు పెట్టారు. అదే సమయంలో లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు కూడా వారిపై రాళ్ళ దాడికి దిగడంతో అమిత్ షా కోల్‌కతా ర్యాలీ హింసాత్మకంగా మారింది. 

కోల్‌కతాలో జరిగిన ఈ హింసాకాండ తృణమూల్ కాంగ్రెస్ అసహనానికి,  అభద్రతాభావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పశ్చిమబెంగాల్ ప్రజలు అందరూ తమవైపే ఉన్నారని, ఈ ఎన్నికలలో బిజెపికి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని గట్టిగా చెపుతున్న మమతా బెనర్జీ కోల్‌కతాలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ర్యాలీ నిర్వహించుకొంటే ఆందోళన చెందడం దేనికి? పైగా భౌతికదాడులకు దిగడం దేనికి? రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ తప్ప మరే పార్టీ పోటీ చేయకూడదని మమతా బెనర్జీ భావిస్తున్నందునే అమిత్ షా ర్యాలీని అడ్డుకొనే ప్రయత్నం చేసి, అది సాధ్యం కాకపోవడంతో భౌతికదాడులకు పాల్పడినట్లు భావించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.


Related Post