ఎల్బీ స్టేడియంలో భారీ ప్రమాదం!

April 22, 2019


img

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సోమవారం సాయంత్రం భారీ ప్రమాదం జరిగింది. ఫ్లడ్ లైట్లు బిగించబడిన భారీ టవర్ ఒకటి హటాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. సమీపంలో పార్క్ చేసి ఉన్న వాహనాలపై ఆ భారీ టవర్ పడటంతో పలు వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి నగరంలో భారీగా ఈదురుగాలులు వీస్తుండటంతో టవర్ కూలిపోయింది. అయితే ఇంతకంటే భారీగా ఈదురుగాలులు వీచినప్పుడే స్టేడియం నాలుగు వైపులా ఉన్న భారీ ఫ్లడ్ లైట్ టవర్లు చెక్కుచెదరలేదు. కనుక టవర్స్ నిర్వహణలో స్టేడియం నిర్వాహకుల అశ్రద్ద కారణంగానే టవర్ పునాదులు బలహీనపడి కూలిపోయుండవచ్చు. 



ఈ విషయం తెలియగానే జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఎల్బీ స్టేడియం చేరుకొని టవర్ కూలిపోవడానికి గల కారణాలను స్టేడియం అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఏదైనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేది. కానీ అదృష్టవశాత్తు స్టేడియం ఖాళీగా ఉన్నప్పుడు టవర్ కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదనుకొంటే ఎల్బీ స్టేడియంతో పాటు దేశంలో గల అన్ని స్టేడియంలలో, అలాగే రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ టవర్లను కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవడం మంచిది. 


Related Post