తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలో మరో షాక్?

April 21, 2019


img

పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు, డికె.అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటంతో  డీలాపడిన తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలో మరో పెద్ద షాక్ తగులబోతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి (సంగారెడ్డి), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), పోడెం వీరయ్య (భద్రాచలం) త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయేందుకు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం.

వారిలో జగ్గారెడ్డి ఎన్నికలలో గెలిచినప్పటి నుంచే కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సిఎం కేసీఆర్‌ కరీంనగర్ పర్యటనకు వచ్చినప్పుడు గండ్ర వెంకటరమణా రెడ్డి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు. అప్పుడే ఆయన తెరాసలో చేరబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. వాటిని ఆయన ఇప్పుడు నిజం చేయబోతున్నారు. ఆయన బాటలోనే పోడెం వీరయ్య కూడా తెరాసలో చేరేందుకు సిద్దం అవుతున్నారని తాజా సమాచారం.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే ఈ ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీ కారెక్కవచ్చునని సమాచారం. తద్వారా వారు ప్రతినిధ్యం వహిస్తున్న  మూడు నియోజకవర్గాలలో తెరాస బలం పెరుగుతుంది. అప్పుడు మరింత సులువుగా పరిషత్ ఎన్నికలలో గెలువగలదు. ఒకేసారి ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడితే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రధానప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.


Related Post