నేడు పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

April 20, 2019


img

లోక్‌సభ ఎన్నికలు పూర్తవగానే రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినందున శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతోంది. పరిషత్ ఎన్నికలను వచ్చే నెల 6,10,14 తేదీలలో మూడు దశలలో నిర్వహించి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటి ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికలు మూడు దశలలో నిర్వహించనున్నందున తదనుగుణంగానే నోటిఫికేషన్‌ కూడా విడుదల చేస్తారు. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం ఈనెల 22,26,30 వ తేదీలలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్స్ వెలువడనున్నాయి. ఈసారి ఎన్నికలలో విశేషమేమిటంటే అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లు సమర్పించవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధుల కోసం కేటాయించిన ఆప్షన్ ఎంచుకొని దానిలో తమ వివరాలను, తాము పోటీ చేయాలనుకొంటున్న స్థానాన్ని పేర్కొనవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించినప్పటికీ అభ్యర్ధులు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా దరఖాస్తును, ఆన్‌లైన్‌లో సమర్పించిన పత్రాల జీరాక్సు కాపీలను  రిటర్నింగ్ అధికారులకు సమర్పించవలసి ఉంటుంది. రాష్ట్రంలో 535 ఎంపీటీసీ, 5,857 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 


Related Post