మరో నెలరోజుల్లో మోడీ మాజీ అవుతారు: అసదుద్దీన్

April 20, 2019


img

మజ్లీస్ పార్టీ తెలంగాణలో హైదరాబాద్‌ దాటి ఇతర జిల్లాలలో ఎన్నికలలో పోటీ చేయడానికి వెనకాడుతునప్పటికీ దేశంలో ఇతర రాష్ట్రాలలో మాత్రం తప్పక పోటీ చేస్తుంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ మరొక నెలరోజులలో ప్రధాని నరేంద్రమోడీ మాజీ ప్రధాని కాబోతున్నారని అన్నారు. మాలేగావ్ మసీదు పేలుళ్ళ కేసులో నిందితురాలిగా ఉన్న   సాధ్వీ ప్రగ్యాసింగ్ కు బిజెపి టికెట్ ఇచ్చి భోపాల్ నుంచి పోటీ చేయించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం పోరాడుతోందని గొప్పలు చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోడీ ఒక ఉగ్రదాడిలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సాధ్వీ ప్రగ్యాసింగ్ కు ఎందుకు టికెట్ కేటాయించారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ముంబై 26/11 ఉగ్రదాడిలో ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన మహారాష్ట్ర పోలీస్ అధికారి హేమంత్ కట్కర్ తన శాపం కారణంగానే చనిపోయాడని సాధ్వీ ప్రగ్యాసింగ్ చెప్పడాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. అటువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు వేయాలని అడుగుతారని అసదుద్దీన్ ఓవైసీ బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించారు.

సాధ్వీ ప్రగ్యాసింగ్ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ సందించిన ప్రశ్నలు సహేతుకమైనవే కనుక వాటికి బిజెపి సంతృప్తికరమైన సమాధానం చెప్పవలసి ఉంది. అలాగే నెలరోజుల తరువాత నరేంద్రమోడీ మాజీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెపుతున్న అసదుద్దీన్ ఓవైసీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత నరేంద్రమోడీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒకవేళ సిఎం కేసీఆర్‌ మద్దతు ఇస్తే అప్పుడు కూడా మజ్లీస్ పార్టీ తెరాసతో కలిసి ఉంటుందా లేదా? అనే ప్రశ్నకు అసదుద్దీన్ ఓవైసీ కూడా సమాధానం చెప్పవలసి ఉంది.


Related Post