మన హైకోర్టుకు 100 ఏళ్ళు

April 20, 2019


img

తెలంగాణ హైకోర్టు ప్రారంభం అయ్యి 100 సం.లు పూర్తయిన సందర్భంగా నేడు హైకోర్టులో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. 

ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1915, ఏప్రిల్ 15న హైకోర్టు భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  ప్రస్తుతం మన కళ్ళ ముందున్న హైకోర్టు భవనాలను అప్పటి నిజాం ప్రభుత్వం చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన అక్బర్ బేగ్, మరో ఇంజనీరు మెహర్ అలీ ఫజిల్ నేతృత్వంలో నిర్మించారు. వారు 1915, ఏప్రిల్ నెలలో భవననిర్మాణపనులు మొదలుపెట్టి 1919, మార్చి 31వ తేదీన పూర్తి చేశారు. ఎటువంటి ఆధునిక యంత్రసామాగ్రి లేని ఆరోజుల్లో అంత పెద్దభవనాన్ని కేవలం నాలుగేళ్ళలో నిర్మించడం సామాన్యమైన విషయం కాదు. 100 ఏళ్ళు గడిచినా ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉండేవిధంగా ధృడంగా, దేశంలో ఇతర చారిత్రిక కట్టడాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా చాలా అందంగా నిర్మించడం ఇంకా కష్టం. జైపూర్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ శంకర్ లాల్ డిజైన్ గీసి ఇచ్చారు. అందుకే హైకోర్టు రూపురేఖలలో కొంత రాజస్థాని ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంటుంది. శంషాబాద్‌ వద్ద గగన్ పహాడ్ వద్ద గల కొండలను త్రవ్వి ఆ రాళ్ళతో హైకోర్టు భవనాన్ని నిర్మించారు. 

హైకోర్టు భవన నిర్మాణం 1919లోనే పూర్తయినప్పటికీ, 1920, ఏప్రిల్ 20న మీర్ ఉస్మాన్ అలీఖాన్ దానిని ప్రారంభించారు. అంటే నేటికీ సరిగ్గా 100 సం.లు పూర్తయిందన్న మాట! ఈ సందర్భంగా నిర్వహించబోయే శతాబ్దీ ఉత్సవాలలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎన్‌వీ రమణ డిల్లీ నుంచి వస్తున్నారు.


Related Post