కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: విజయశాంతి

April 19, 2019


img

రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు పంజగుట్ట చౌరస్తాలో అనుమతి లేకుండా అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయగా దానిని పోలీసులు వెంటనే తొలగించారు. విగ్రహాన్ని తొలగించినందుకు, తొలగించిన విగ్రహాన్ని డంపింగ్ యార్డులో పడేసినందుకు మందకృష్ణ మాదిగ నిరసన తెలియజేయడానికి సిద్దపడితే పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ వరుస పరిణామాలపై కాంగ్రెస్‌, బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగకు సంఘీభావం తెలిపారు. 

కాంగ్రెస్‌ నేత విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు మొదటి నుంచి దళితులంటే చిన్న చూపే. అదే మరోసారి నిరూపించి చూపారు. అంబేడ్కర్‌ విగ్రహం తొలగించి చెత్తకుప్పలో పడేసినట్లు తెలిసినప్పటికీ ఇంతవరకు ఆయన స్పందించలేదు. మందకృష్ణ మాదిగ శాంతియుతంగా నిరసన తెలపాలనుకొంటే ఆయనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? రాష్ట్రంలో నిరంకుశపాలన సాగుతోంది. ఇప్పటికైనా సిఎం కేసీఆర్‌ జరిగినదానికి విచారం వ్యక్తం చేసి మళ్ళీ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయించాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తాము,” అని హెచ్చరించారు.

ట్యాంక్ బండ్ పై గల అంబేడ్కర్ విగ్రహం వద్ద బిజెపి నేతలు నిరసనలు తెలియజేశారు. బిజెపి నేత కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “అంబేడ్కర్ జయంతినాడు ఎవరైనా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం చాటుకొంటారు. కానీ సిఎం కేసీఆర్‌ ఏనాడూ అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనలేదు కనీసం విగ్రహానికి దండ వేయాలనుకోరు.  దేశంలో ప్రతీ ఊరిలో అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొంటుంటే, తెలంగాణలో మాత్రం అంబేడ్కర్ విగ్రహాల తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతోంది. తెలంగాణ ఏర్పడితే దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్‌ నేటికీ ఆ సీట్లో తనే కూర్చోని పాలిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం తొలగించి డంపింగ్ యార్డులో పడేసినందుకు సిఎం కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పి తక్షణం అక్కడ మళ్ళీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి,” అని అన్నారు. 


మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ, “డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం తొలగించి డంపింగ్ యార్డులో పడేయడం అంటే బడుగుబలహీనవర్గాల పట్ల చులకనభావం ప్రదర్శించడమే. ఇందుకు నిరసనగా నేటి నుంచి ఈనెల 22వరకు హైదరాబాద్‌ నగరంలో గల అన్ని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తాము. దేశంలో జాతీయనేతలను హైదరాబాద్‌కు ఆహ్వానించి ఈ నెల 27న  బహిరంగసభ ఏర్పాటు చేసి ఈ సమస్య తీవ్రతను అందరూ గుర్తించేలా చేస్తాము,” అని చెప్పారు. 


Related Post