రాష్ట్రంలో సమగ్ర రైతు సర్వే షురూ

April 18, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మరో సర్వే మొదలైంది. అయితే ఇది ఎన్నికలకు సంబందించినది కాదు. రాష్ట్రంలో రైతులకు సంబందించి సమగ్ర సమాచారం సేకరించేందుకు చేపట్టిన సర్వే ఇది. మొదట దీనిని 10 రోజులలో పూర్తి చేయాలని సిఎం కేసీఆర్‌ సూచించగా అంతతక్కువ సమయంలో పూర్తిచేయడం కష్టమని తమను ఎన్నికల డ్యూటీలలో వినియోగించకుండా కనీసం నెలరోజులు సమయమిచ్చినట్లయితే సర్వే పూర్తి చేయగలమని వ్యవసాయశాఖ అధికారులు చెప్పడంతో కేసీఆర్‌ అందుకు అంగీకరించారు. 

కనుక రాష్ట్రంలో మళ్ళీ రైతు సర్వే ప్రారంభం అయ్యింది. ఇది మే 20వరకు కొనసాగుతుంది. ఈ సర్వేలో పాల్గొనే ఏఈఓ (వ్యవసాయ విస్తరణాధికారి)లు తప్పనిసరిగా ప్రతీ గ్రామంలోని ప్రతీ రైతు ఇంటికీ వెళ్ళి, వారి భూమి, బ్యాంక్ అకౌంట్, సాగుచేస్తున్న పంటల వివరాలు అన్నీ సేకరిస్తారు. ఇదే సమయంలో పాసు పుస్తకాలు అందక ఇబ్బందులు పడుతున్న రైతుల వివరాలను, పాసు పుస్తకాలు జారీ చేయకపోవడానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకొని ఆ వివరాలను కూడా తమ నివేదికలలో పొందుపరిచి ప్రభుత్వానికి అందజేస్తారు. 

అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 54.60 లక్షల మంది రైతులు లేదా వ్యవసాయభూములున్నవారున్నారు. ఆ లెక్కప్రకారమే వారందరికీ ప్రభుత్వం రైతుబందు పధకం వర్తింపజేస్తోంది. కానీ వివిద కారణాల చేత రాష్ట్రంలో వేలాదిమంది రైతులకు నేటికీ పాసు పుస్తకాలు అందలేదు. తాజా సర్వేలో ఈ సమస్య పరిష్కరించబడవచ్చు కనుక రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భూమి తాలూకు వివరాలను ఏఈఓలకు తెలియజేసి నమోదు చేయించుకోవడం మంచిది. 

ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో పంటకాలనీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఏఏ ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉంది? దానిని ఎంత పండిస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయి? రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సదుపాయాలు ఏవిధంగా కల్పించాలి? అనే వివిద అంశాలను ఈ సర్వే ఆధారంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికే ‘డిమాండ్-సప్లై’ విధానంలో కొన్ని జిల్లాలలో ప్రయోగాత్మకంగా పంటలు పండిస్తున్నారు. కనుక ఈ సర్వే పూర్తయి దాని ఆధారంగా పంట ప్రణాళికలు, మార్కెటింగ్ ఏర్పాట్లు జరిగితే రాష్ట్రంలో రైతుల కష్టాలు తప్పకుండా తీర్చవచ్చునని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. 


Related Post