ఏపీలో హన్మంతన్న ధర్నాలు!

April 18, 2019


img

రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలు భౌగోళికంగానే కాక రాజకీయంగా కూడా విడిపోయాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ, రెండు రాష్ట్రాలలోని కాంగ్రెస్‌ నేతలు పొరుగు రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ కాంగ్రెస్‌, తెరాస కారణంగా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రస్తుతం ఒకే దుస్థితిలో ఉన్నాయి. అయితే అది అప్రస్తుతం. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆ రాష్ట్రంలో హడావుడి చేస్తుండటమే ప్రస్తుతం విషయం.

హైదరాబాద్‌ పంజగుట్టలో నెలకొల్పిన డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీసులు తొలగించడాన్ని నిరసిస్తూ ఆయన ధర్నా చేయడం విచిత్రమేమీ కాదు కానీ ఏపీలో ధర్నాలు చేయాలనుకోవడమే విడ్డూరంగా ఉంది. ఆయన గురువారం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు వచ్చి స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

“నా 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ ఎన్నికల సంఘం ఇంత దారుణంగా వ్యవహరించడం చూడలేదు. మొట్టమొదటిసారిగా ఏపీలో చూశాను. ఎటువంటి బలమైన కారణం లేకుండా ఎన్నికల సంఘం ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కీలకమైన ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో సహా అనేకమందిని బదిలీ చేసింది. తెరాస ప్రభుత్వం కూడా నిరంకుశవైఖరితో వ్యవహరిస్తోంది. పంజాగుట్టలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించి బడుగుబలహీనవర్గాల ప్రజల పట్ల తెరాస ప్రభుత్వం చులకనభావం ప్రదర్శించింది. కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏపీలోని అన్ని జిల్లాలలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద శుక్రవారం కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నాలు చేయబోతున్నాము,” అని అన్నారు. 

వైసీపీ నాయకులు ఏపీలో ఏదైనా సమస్య ఎదురైతే హైదరాబాద్‌ వెళ్ళి తెలంగాణ పోలీసులకు పిర్యాదులు చేస్తుంటారు. కానీ హన్మంతన్న హైదరాబాద్‌లో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం తొలగిస్తే ఏపీలో ధర్నాలు చేస్తున్నారు!


Related Post