కల నెరవేరింది..కాళేశ్వరం పారింది

April 18, 2019


img

తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేయబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బుదవారం మధ్యాహ్నం 12.36 గంటలకు మొట్టమొదటిసారిగా నీటిని విడుదల చేసి ట్రయల్ రన్స్ నిర్వహించారు అధికారులు. ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు తదితర ఉన్నతాధికారులు పాలకుర్తి మండలం వేమునూరులోని రెగ్యులేటర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, మీట నొక్కి కొద్దిగా గేట్లు తెరిచి కాలువలోకి నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి సుమారు కిమీ పొడవున్న గ్రావిటీ కాలువ ద్వారా ఎల్లంపల్లి జలాలు సొరంగంలోకి చేరాయి. మళ్ళీ అక్కడి నుంచి సుమారు 9.5 కిమీదూరంలో గల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని సర్జ్‌పూల్‌(చెరువు)కు చేరుకొన్నాయి. 


అక్కడ నిర్మించిన బారీ సర్జ్ పూల్ నిండేందుకు సుమారు 4-5 రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. దానిని నీటితో నింపేముందు కాలువ గట్టులలో ఏమైనా పగుళ్లు ఏర్పడ్డాయా, సొరంగా మార్గంలో లీకేజీలు ఏర్పడ్డాయా? మరింత నీటిని విడుదల చేసినప్పుడు ఇతరత్రా సమస్యలేమైనా ఉత్పన్నం అవుతాయా? వంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత క్రమంగా నీటిని విడుదల చేసి నందిమేడారంలోని సర్జ్‌పూల్‌ను నింపుతామని నల్ల వెంకటేశ్వర్లు చెప్పారు. 1.78 మిలియన్ ఘనపుటడుగుల నీటిని నిలువ ఉంచే సామర్ధ్యంతో సర్జ్‌పూల్‌ను నిర్మించమని తెలిపారు. ఈ నెల 22లోగా దానిని పూర్తిగా నింపిన తరువాత ఒక్కో పంపును నడిపించి మళ్ళీ ట్రయల్ రన్స్ నిర్వహిస్తామని తెలిపారు.  నందిమేడారంలో ఇప్పటికే నాలుగు భారీ మోటారుపంపులు బిగించడం పూర్తయింది. వాటితో మేడారం చెరువులోకి నీటిని ఎత్తిపోసుకోవచ్చునని నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ నాటికి మిగిలిన 3 పంపులు బిగించడం పూర్తవుతుందని నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. 

   

నందిమేడారం చెరువు నుంచి నీళ్ళు ఎత్తిపోస్తే అవి లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ వద్దకు చేరుకొంటాయి. మళ్ళీ అక్కడ వరదకాలువలోకి ఎత్తిపోస్తే మిడ్ మానేరుకు చేరుతాయి. జూన్ నాటికల్లా అన్ని పనులు పూర్తి చేసి ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు నీటిని విడుదల చేసేందుకు సిద్దంగా ఉంటామని నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు.

ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌, భూసేకరణ విభాగం ఓఎస్డీ మనోహర్‌, ఆరో ప్యాకేజీ పనులు చేపట్టిన కంపెనీ ఏజీఎం శ్రీనివాసరావు, జేఈలు, రిటైర్డ్ సీఈ వెంకటరామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ట్రయల్ రన్ విజయవతం అవడంతో అందరూ ఆనందంగా ఒకరికొకరు మిటాయిలు తినిపించుకొన్నారు.


Related Post