జగిత్యాలలో ఆటోరిక్షాలో ఈవీఎంలు రవాణా!

April 16, 2019


img

ఈవీఎంల గురించి ఏపీ సిఎం చంద్రబాబునాయుడు చేస్తున్న హడావుడితో ఈవీఎంలో లోపాలు...వాటి వినియోగంపై మీడియాలో జోరుగా చర్చ జరుగుతుండగా సోమవారం రాత్రి జగిత్యాల తహసిల్దార్ కార్యాలయం నుంచి 10 ఈవీఎంలను అధికారులు ఒక ఆటో రిక్షాలో స్థానికం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గోదాముకు తరలించే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. కానీ ఆ సమయంలో ఈవీఎంలను భద్రపరిచిన గోదాముకు తాళం వేసి ఉండటంతో మళ్ళీ అదే ఆటోరిక్షాలో వాటిని తహశీల్దార్ కార్యాలనికి చేర్చారు. రెండు రోజుల క్రితం కొన్ని ఈవీఎంలను ఈవిదంగానే ఒక ప్రైవేట్ కారులో గోదాముకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు పనివేళలు పూర్తయిన తరువాత రాత్రిపూట ఆటో రిక్షాలో ఈవీఎంలను గోదాముకు తరలించవలసిన అవసరం ఏమిటి? ఎవరి ఆదేశాలతో వాటిని ఆ సమయంలో తరలించే ప్రయత్నం చేశారు? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అవి కేవలం శిక్షణ, అవగాహన కోసం తెచ్చిన ఈవీఎంలని, ఎన్నికలలో ఉపయోగించినవి కావని తహశీల్దార్ కార్యాలయ అధికారులు చెపుతున్నారు. కానీ పైఅధికారుల ఆదేశాలు లేకుండా, వారికి సమాచారం ఇవ్వకుండా ఈవీఎంల తరలించడానికి ప్రయత్నించినందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సదరు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ జరుపుతున్నారు. 


Related Post