తలసాని సాయికిరణ్ కు హైకోర్టు ప్రశ్న

April 16, 2019


img

మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికలబరిలో దిగిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెరాస అభ్యర్ధిగా సాయి కిరణ్, బిజెపి అభ్యర్ధిగా కిషన్‌రెడ్డి సికిందరాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. 

గత సోమవారం నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేరిట జారీ అయిన సెల్ఫ్ చెక్కుతో బ్యాంకు నుంచి ఒకేసారి రూ.8 కోట్లు డ్రా చేసి తీసుకువెళుతుండగా అది పోలీసులకు పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు రూ.2 లక్షలకు మించి నగదు వెంట తీసుకువెళ్లడానికి వీలులేదు. కనుక ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కె.లక్ష్మణ్ పై కోర్టులో కేసు వేసి ఉంటే, దానికి సాక్ష్యాధారాలున్నాయి కనుక న్యాయస్థానం తప్పకుండా ఆయనపై చర్యలు తీసుకొని ఉండేది. కానీ ఈ కేసును కిషన్‌రెడ్డికి ముడిపెట్టి దెబ్బతీయాలని ప్రయత్నించి తలసాని సాయి కిరణ్ భంగపడ్డారు. కిషన్‌రెడ్డి ఆ డబ్బును సికిందరాబాద్‌ నియోజకవర్గంలో ఓటర్లకు పంచిపెట్టేందుకే డ్రా చేశారని, కనుక ఆయనను ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ తలసాని సాయి కిరణ్ హైకోర్టులో కేసు వేశారు. 

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ రాజశేఖర్ రెడ్డిలతో కూడిన  హైకోర్టు ధర్మాసనం  ఆ పిటిషనుపై సోమవారం విచారణ జరిపినప్పుడు, “ఆ డబ్బును కిషన్‌రెడ్డి బ్యాంక్ నుంచి డ్రా చేశారని, దానిని ఓటర్లకు పంచడానికే తీసుకువెళుతున్నారని నిరూపించేందుకు మీ వద్ద సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? లేనప్పుడు ఆయనపై అనర్హత వేటు వేయాలని ఏవిధంగా అడుగుతున్నారు?” అని సాయి కిరణ్ తరపు వాదించిన న్యాయవాదిని ప్రశ్నించారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇటువంటి ఫిర్యాదులపై స్పందించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 


Related Post