వరుస ఎన్నికలపై కేటీఆర్‌ కామెంట్స్

April 15, 2019


img

సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో మ్రోగిన ఎన్నికల గంటలు 7 నెలలుగా నేటికీ గణగణమని మ్రోగుతూనే ఉన్నాయి. పరిషత్ ఎన్నికలు, వాటి తరువాత మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇంకా మ్రోగుతూనే ఉంటాయి కూడా. ఈ వరుస ఎన్నికలు, రాజకీయ పార్టీల హడావుడితో ప్రజలు చాలా విసుగెత్తిపోతున్నారు. పోలీస్, ప్రభుత్వాధికారులలో చాలామంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ఎన్నికల పనులలో మునిగి తేలుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాలలో పనులు కాక సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరుస ఎన్నికల కారణంగా రాష్ట్రంలో నిరంతరంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుండటంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడక నిరుద్యోగులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 

ఈ వరుస ఎన్నికల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా గమనించినట్లే ఉన్నారు. తెలంగాణ భవన్‌లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈ వరుస ఎన్నికల వలన కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఇదీ మన మంచికే అనుకోవాలి. పరిషత్ ఎన్నికలు పూర్తయిపోతే మున్సిపల్ ఎన్నికలు మాత్రమే ఉంటాయి. ఇక నాలుగున్నరేళ్లు రాష్ట్రంలో మరే ఎన్నికలు ఉండవు….ఎన్నికల కోడ్ కూడా ఉండదు. కనుక పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టగలుగుతామని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఆయన ప్రభుత్వ పాలనా వ్యవహారాలను చూసుకొంటారు. మేము పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ శిక్షణా కార్యక్రమాలు, కమిటీలు ఏర్పాటు వంటి పార్టీ పనులను చూసుకొంటాము,” అని అన్నారు. 


Related Post