బిజెపి కాదు...సైనికులు కాపాడుతున్నారు: అఖిలేశ్

April 15, 2019


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మొదటిదశలోనే ఎన్నికలు జరిగిపోవడంతో రెండు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం కాస్త చల్లబడింది. కానీ దేశంలో ఇతర రాష్ట్రాలలో ఈనెల 18,23,29 తేదీలలో వరుసగా ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఆయా రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు వాటి నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటున్నందున నానాటికీ వేడి పెరుగుతూనే ఉంది.

 ఈసారి ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలు పుల్వామా ఉగ్రదాడి...పాక్‌ భూభాగంపై వైమానిక దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవడం గురించి చెప్పుకొంటూ మోడీ చేతిలోనైతేనే దేశం సురక్షితంగా ఉంటుందని వాదిస్తున్నారు. వారి వాదనలకు యూపీ మాజీ సిఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఘాటుగా సమాధానం చెప్పారు.   

“నరేంద్రమోడీ ఎల్లప్పుడూ దబ్బునవారికి, కార్పొరేట్ కంపెనీలకే అండగా నిలబడి వారికి మేలు కలిగే పనులే చేశారు తప్ప దేశంలో సామాన్యప్రజల గోడు ఏనాడూ పట్టించుకోలేదు. పెద్దనోట్ల రద్దు, రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు అందుకు చక్కటి ఉదాహరణలు. ఇక ప్రధాని నరేంద్రమోడీ చేతిలో దేశం సురక్షితంగా ఉంటుందని బిజెపి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. దేశాన్ని...దేశ సరిహద్దులను కాపాడుతున్నది బిజెపి కాదు...నరేంద్రమోడీ కాదు. మన జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. ఆ క్రెడిట్ వారికే చెందాలి తప్ప మోడీకో బిజెపికో కాదు. మోడీని గద్దె దించి దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించి, రాజ్యాంగ పరిరక్షణ చేయవలసిన అవసరం ఉంది. అందుకే యూపీలో ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి,” అని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. 


Related Post