అందుకే పవన్‌ క్యూలో నిలబడలేదు

April 12, 2019


img

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిన్న విజయవాడ వద్ద పటమటలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు. అయితే పోలింగ్ బూత్ వద్ద గంటల తరబడి క్యూలో ఓటర్లు నిలబడి ఉండగా ఆయన క్యూలో నిలబడకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళిపోయి ఓటు వేశారని మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అయితే, పవన్‌ కల్యాణ్‌ వెంట తరలివచ్చిన అభిమానులు, మీడియా ప్రతినిధుల వలన క్యూలో నిలుచొన్న తమకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయనను నేరుగా ఓటు వేయడానికి అంగీకరించామని కొందరు మహిళలు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ క్రమశిక్షణ పాటించే వ్యక్తి అని స్థానిక జనసేన నాయకుడు ఒకరు అన్నారు. పవన్‌ కల్యాణ్‌కు కూడా అందరిలాగే వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారని కానీ ఆయనను చూసేందుకు అభిమానులు, ఫోటోలు తీసుకొనేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తుండటంతో వారి వలన తమకు ఇబ్బంది కలుగుతోందనే ఉద్దేశ్యంతో క్యూలైన్లో ఉన్నవారే ఆయనను నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఓటు వేయాలని సూచించారని చెప్పారు. ఓటర్లకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశ్యంతోనే పవన్‌ కల్యాణ్‌ ఓటు వేసిన తరువాత కూడా అక్కడ ఎక్కువసేపు నిలబడకుండా మీడియాతో క్లుప్తంగా మాట్లాడివెళ్లిపోయారు.  

2014 ఎన్నికలలో పవన్‌ కల్యాణ్‌కు సోదరుడు చిరంజీవి సకుటుంబ సమేతంగా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లబోతుంటే, క్యూలైన్లో నిలబడి ఉన్న కార్తీక్ అనే ఎన్ఆర్ఐ అభ్యంతరం తెలపడంతో చిరంజీవి, కుటుంబ సభ్యులు మళ్ళీ వెనక్కు వెళ్ళి క్యూలైన్లో నిలబడి ఓట్లేశారు.


Related Post