ఇప్పటికైనా కశ్మీర్ ప్రజలు మేల్కొంటారా?

March 23, 2019


img

భారత్‌ దేశానికి స్వర్గభూమిలా ఉండవలసిన కశ్మీర్ ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిలా మారిందని చెప్పక తప్పదు. కశ్మీర్ ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువత వేర్పాటువాదులు, ఉగ్రవాదులవైపు ఆకర్షితులవుతున్నారు. కశ్మీరీ ప్రజలు వారికి సహకరిస్తున్నందున కశ్మీర్ వేర్పాటువాదులకు అడ్డాగా మారిపోయిందిప్పుడు.

ఇప్పుడు ఈ సమస్యలోనే మరో సరికొత్త సమస్య కూడా తాజాగా వెలుగు చూసింది. కశ్మీర్‌లోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులు భద్రతాదళాల దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి తమకు ఆశ్రయం కల్పిస్తున్న స్థానిక ప్రజలను, ముఖ్యంగా పసిపిల్లలను మానవ కవచంగా వాడుకొంటున్నారు. కశ్మీర్‌లో ఇది చాలా కాలంగానే సాగుతోంది. అందుకే మన భద్రతాదళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టినప్పటికీ , తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాల కోసం పోరాడవలసి వస్తోంది. ఇదే ఓ పెద్ద సమస్య అనుకొంటే ఇంతకంటే పెద్ద సమస్య మరొకటి వెలుగు చూసింది.

గురువారం కశ్మీర్‌లోని బందీపోరా అనే ప్రాంతంలో ఒక ఇంట్లోకి కొందరు లష్కర్ ఉగ్రవాదులు జొరబడ్డారు. వారిలో అలీభాయ్‌ అనే ఒక ఉగ్రవాది ఆ ఇంట్లోని 12 ఏళ్ళ బాలికను లొంగతీసుకోవాలని చూశాడు. కానీ ఆ బాలిక ప్రతిఘటించి తప్పించుకొని పారిపోయింది. దాంతో ఆ ఉగ్రవాదులు ఆ బాలిక సోదరులు అతిఫ్‌, హమీద్‌లను కిడ్నాప్ చేసి తమతో తీసుకుపోయారు. ఆ బాలికను తమకు అప్పజెప్పితేనే వారిద్దరినీ విడిచిపెడతామని చెప్పారు. ఆ ఇంటి పెద్ద, ఆయన భార్య తమ పిల్లను విడిచిపెట్టమని ఆ ఉగ్రవాదులను ఎంత ప్రాధేయపడినా వారు కనికరించలేదు. ఆ ఇద్దరు సోదరులలో హమీద్ వారి చెర నుంచి తప్పించుకొని బయటపడగలిగాడు. కానీ అతీఫ్ మాత్రం వారి చెరలో చిక్కుకుపోయాడు.

ఈ విషయం తెలుసుకొన్న భద్రతాదళాలు ఆ ఇంటిని చుట్టుముట్టి ఆ బాలుడిని వారి చెర నుంచి విడిపించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఉగ్రవాదులు ఆ బాలుడిని మానవకవచంగా వాడుకొంటూ భారీ ప్రేలుళ్ళకు సిద్దపడటంతో భద్రతాదళాలు కూడా ధీటుగా స్పందించవలసి వచ్చింది. పరస్పర కాల్పులలో ఉగ్రవాదులు, వారి చెరలో చిక్కిన ఆ బాలుడు కూడా మృతి చెందారు.

పాముకు పాలుపోసి పెంచితే ఏమవుతుందో, ఉగ్రవాదులతో, వేర్పాటువాదులతో చేతులు కలిపినా అదే జరుగుతుందని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. కనుక ఇప్పటికైనా కాశ్మీరీ ప్రజలకు ఈ విషయం అర్ధమవుతుందో లేదో? కాకపోతే దానికి వారే మూల్యం చెల్లించక తప్పదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.


Related Post