ప్రకాష్ రాజ్‌ కూడా ఎన్నికలలో పోటీ

March 23, 2019


img

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ కూడా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దమయ్యారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ఆయన శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తన భార్య పోనీ వర్మ, ప్రకాష్ రాజ్‌ ఫౌండేషన్ సభ్యులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్ పోటీ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్‌ మొదటి నుంచి మతతత్వ బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని, ఆయన నిరంకుశపాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో బిజెపిని, కేంద్రప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ మెసేజులు పెడుతుంటారు. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు ప్రకాష్ రాజ్ హైదరాబాద్‌ వచ్చి జెడిఎస్ పార్టీ తరపున సిఎం కేసీఆర్‌తో రాయబారం చేయడం, అనంతరం సిఎం కేసీఆర్‌ బెంగళూరు వెళ్ళి దేవగౌడ, కుమారస్వామిలతో సమావేశంలో పాల్గొనడం, జెడిఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం, అనూహ్య పరిణామాల తరువాత కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రావడం మొదలైనవన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. కనుక ప్రకాష్ రాజ్‌ రాజకీయాలలో చురుకుగానే పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు నేరుగా ఎన్నికలలోనే పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టాలనుకొంటున్నారు. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్‌-జెడిఎస్ పార్టీలు అండగా నిలబడి గెలిపించుకొంటాయో లేక తమ అభ్యర్ధిని నిలబెడతాయో చూడాలి.


Related Post