జి వివేక్ రాజీనామా

March 23, 2019


img

పెద్దపల్లి లోక్‌సభ టికెట్ కేటాయించనందుకు నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి వివేక్ తన పదవికి రాజీనామా చేశారు. సిఎం కేసీఆర్‌కు పంపిన తన రాజీనామా లేఖలో, “2019 లోక్‌సభ ఎన్నికలలో నాకు పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి నన్ను తెరాసలో చేర్చుకొన్నారు. తెలంగాణ సాధనకోసం నేను చురుకుగా పోరాడినందున నాకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చారు. కానీ మీరు నాకు హామీ ఇచ్చినట్లు ఈ ఎన్నికలలో పెద్దపల్లి లోక్‌సభ టికెట్ నాకు ఇవ్వకపోవడం నన్ను, నా కుటుంబ సభ్యులను చాలా బాధించింది. అందుకు నిరసనగా నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను,” అని వ్రాశారు. 

పెద్దపల్లి నుంచి మొదట జి వివేక్ తెరాస అభ్యర్ధిగా అనుకొన్నప్పటికీ, వివిద కారణాల చేత బోర్లకుంట వెంకటేష్ నేతకానికి టికెట్ కేటాయించారు. దీంతో జి.వివేక్ అలకబూని తన పదవికి రాజీనామా చేసి నిరసన తెలిపారు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ నిరాకరించడంతో ఆయన కూడా అలకలో ఉన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో నిన్న ఖమ్మం జిల్లా నేతల సమన్వయసమావేశానికి హాజరు కాకుండా తన నిరసన తెలిపారు.            

టికెట్లు కేటాయింపు తరువాత ఇటువంటి అలకలు, రాజీనామాలు, ఫిరాయింపులు సాధనమైయన్ విషయమే. అయితే వివేక్ రాజీనామాలేఖలో వ్రాసిన అంశమే ఆలోచింపజేస్తుంది. ఆరోజు తెరాసలో చేరేటప్పుడు బంగారి తెలంగాణ సాధన కోసమే తెరాసలో చేరుతున్నానని చెప్పుకొన్న వివేక్ ఇప్పుడు తనంతటతానుగా అసలు విషయం బయటపెట్టారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసమే తెరాసలో చేరినట్లు స్వయంగా చెప్పుకొన్నారు. కనుక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులకు ఆశపడే తెరాసలో చేరుతున్నారని స్పష్టం అవుతోంది.       



Related Post