ఇదేంది ప్రియాంకా?

March 21, 2019


img

గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరు మహనీయులపట్ల మన రాజకీయ నాయకులలో చాలా మందికి మనసులో గౌరవం లేకపోయినప్పటికీ ప్రజల కోసమో లేక రాజకీయ అవసరాల కోసం వారి పట్ల చాలా గౌరవం ఉన్నట్లు నటిస్తూ వారి విగ్రహాలకు పూలదండాలు వేసి దండాలు పెడుతుంటారు. అటువంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బనారస్ లో నేడు జరిగింది. 

లోక్‌సభ ఎన్నికలలో తూర్పు ఉత్తరప్రదేశ్ నియోజకవర్గాలకు ఇన్-ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఏఐసిసి కార్యదర్శి ప్రియాంకా వాద్రా బుదవారం వారణాసిలో స్వర్గీయ లాల్ బహద్దూర్ శాస్త్రి ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంగా భారీ సంఖ్యలో అక్కడకు తరలివచ్చిన కాంగ్రెస్‌ నేతలు ఆమెకు పూలదండలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆమె చిరునవ్వుతో వారందరికీ అభివాదం చేస్తూ తన మెడలో ఉన్న పూలదండను అక్కడే ఉన్న లాల్ బహద్దూర్ శాస్త్రి విగ్రహానికి వేశారు. ఆ హడావుడిలో కాంగ్రెస్‌ నేతలు ఎవరూ పట్టించుకోలేదు కానీ ఆమె చేసిన పని మీడియాలో రావడంతో బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో లాల్ బహద్దూర్ శాస్త్రికి బ్రతికి ఉన్నప్పుడే గౌరవం లభించలేదని, చనిపోయినా తరువాత కూడా ఆయనను గౌరవించలేకపోతోందని స్మృతీ ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న స్థానిక బిజెపి నేతలు వెంటనే అక్కడకు చేరుకొని లాల్ బహద్దూర్ శాస్త్రి విగ్రహాన్ని గంగాజలంతో కడిగి శుద్ధి చేశారు.

దేవుడికి సమర్పించే పూలను కేవలం వాసన చూసినా వాటిని పూజకు వినియోగించకూడదనుకొంటాము. అటువంటిది ఒకరు ధరించిన పూలమాలను జాతీయనాయకుల విగ్రహానికి వేయడాన్ని ఏమనుకోవాలి? అవగాహనా రాహిత్యమా లేక గౌరవం లేకపోవడమా? స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ కుటుంబంలోనే ప్రియాంకా వాద్రా జన్మించినప్పటికీ, జాతీయ నాయకులపట్ల ఆమెకు సరైన అవగాహన, గౌరవం లేవని ఈ సంఘటన నిరూపిస్తోంది. 

 


Related Post