కాంగ్రెస్‌ ఖాళీ అయిపోతోంది... పరవాలేదు!

March 21, 2019


img

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతోందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. అదేసమయంలో గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, నేతలు వెళ్ళిపోయినా పరవాలేదు... కాంగ్రెస్ పార్టీకి ఏమి కాదు,” అని చెప్పడం విశేషం. 

ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇంచార్జ్ అనీల్ జాదవ్, పిసిసి అధికార ప్రతినిధి గోసుల శ్రీనివాస్ యాదవ్, మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కోశాధికారి జూపల్లి భాస్కర్, అనుచరులు, నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బుదవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, “రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నందునే తెలంగాణ ప్రజలు తెరాసను ఆదరించి మళ్ళీ గెలిపించారు. లక్షలాదిగా ప్రజలు, ఇతర పార్టీలు నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారు. కాంగ్రెస్‌, బిజెపిలు రైతులకు ఏమీ చేయకుండానే ‘జై జవాన్’ నినాదంతో దశాబ్ధాలుగా రైతులను మోసం చేస్తుంటే, సిఎం కేసీఆర్‌ రైతుల కోసం సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు బందు, రైతుభీమా వంటి అనేక కార్యక్రమాలు అమలుచేసి చూపిస్తున్నారు. ఇతర పార్టీలకు ‘జై జవాన్’ ఒక నినాదం మాత్రమే కానీ మా పార్టీ దానిని ఒక విధానంగా భావించి అమలుచేస్తోంది. అందుకే తండోపతండాలుగా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు వచ్చి తెరాసలో చేరుతున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్ధులను కాంగ్రెస్‌ పార్టీ మళ్ళీ లోక్‌సభకు పోటీ చేయించడం విడ్డూరంగా ఉంది. చిరిగిన నోటు చెల్లన్నట్లే ఒకసారి ప్రజలు తిరస్కరించిన అభ్యర్ధులు కూడా చెల్లరు. లోక్‌సభ ఎన్నికలలో ప్రజలు వారిని చిత్తుచిత్తుగా ఓడించి మరోసారి బుద్ధి చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాహుల్ గాంధీకి, బిజెపికి ఓటేస్తే నరేంద్రమోడీ లాభపడతారు. కానీ తెరాసకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ లాభపడుతుందని ప్రజలు గుర్తుంచుకోవాలి. కనుక 16 మంది గులాబీ సైనికులను గెలిపించుకొని లోక్‌సభకు పంపించాలని ప్రజలను కోరుతున్నాను. 

ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేలలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినన్ని ఎంపీ సీట్లు రావని స్పష్టం చేస్తున్నాయి. కనుక 16 మంది తెరాస ఎంపీలను మనం డిల్లీకి పంపించినట్లయితే, ఇతర పార్టీల ఎంపీలతో కలిపి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించబోతున్నారు. డిల్లీలో తెలంగాణకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజలు 16 మంది తెరాస ఎంపీలను గెలిపించాలని కోరుతున్నాను,” అని అన్నారు.


Related Post