గోవా కొత్త ముఖ్యమంత్రి: ప్రమోద్ సావంత్

March 18, 2019


img

గోవా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మనోహార్ పారిక్కర్ తీవ్ర అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందడంతో ఆయన స్థానంలో గోవా అసెంబ్లీ స్పీకరుగా వ్యవహరిస్తున్న ప్రమోద్ సావంత్ ను బిజెపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్నారు. 

ఈరోజు ఉదయం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సమక్షంలో సమావేశమైన బిజెపి ఎమ్మెల్యేలు, వారి సూచనల మేరకు ప్రమోద్ సావంత్ ను తమ నాయకుడిగా ఎన్నుకొన్నారు. దీంతో గోవా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరికొద్దిసేపటిలో గోవా గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ అంత్యక్రియలు గోవాలోని ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన మీరామిర్ బీచ్ లో సోమవారం సాయంత్రం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా పలువురు కేంద్రమంత్రులు, బిజెపి సీనియర్ నేతలు హాజరయ్యి నివాళులు అర్పించారు.


Related Post