అందుకే 16 సీట్లు అడుగుతున్నారు: రేవంత్‌ రెడ్డి

March 18, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “16 ఎంపీ సీట్లు ఇస్తే డిల్లీలో చక్రం తిప్పుతానని ప్రజలను మభ్యపెడుతున్నారు. కానీ 16 ఎంపీలతో ఆయన డిల్లీలో బొంగరం కూడా తిప్పలేరు. 16 ఎంపీలతో డిల్లీలో చక్రం తిప్పగలిగి ఉంటే మరి 5 ఏళ్ళపాటు ఆయన వద్ద 15మంది ఎంపీలున్నారు కదా? వారితో ఏమి సాధించారు? సిఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 16 సీట్లను గెలుచుకొని వాటిని డిల్లీలో నరేంద్రమోడీకి అమ్ముకొంటారు. రాష్ట్రంలో గులాబీ రంగులో ఉండే 16 ఎంపీ సీట్లు, డిల్లీ వెళ్ళగానే కాషాయం రంగులోకి మారిపోతాయి. ఇక్కడ కారు గుర్తు కాస్తా డిల్లీ వెళ్ళగానే కమలం గుర్తుగా మారిపోతుంది. నరేంద్రమోడీకి మద్దతు ఇవ్వడానికే కేసీఆర్‌ 16 ఎంపీ సీట్లు అడుగుతున్నారు తప్ప ఆయన జాతీయ రాజకీయాలలో చేయగలిగింది ఏమీ ఉండదు. కనుక తెరాసకు ఓట్లు వేస్తే బిజెపికి ఓట్లు వేసినట్లేనాని తెలంగాణ ప్రజలు గ్రహించాలి. 

ఇక్కడ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహించి అప్రజాస్వామిక, అనైతికంగా వ్యవహరిస్తున్న సిఎం కేసీఆర్‌ డిల్లీకి వెళ్ళి ఏమి చేస్తారు? అక్కడ కూడా ఈ అవలక్షణాలను వ్యాపింపజేస్తారా? ఈ సంతలో కొన్న పశువులను ఆ సంతలో అమ్ముకొని లాభం సంపాదించినట్లుగా, ఇక్కడ ఎంపీలతో డిల్లీలో మోడీకి మద్దతు ఇచ్చి లాభం పొందాలని సిఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఎవరైనా ఎన్నికలకు ముందు పార్టీ పెడతారు. కానీ సిఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలైపోయిన తరువాత జాతీయపార్టీ పెడతానని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇవన్నీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడానికే తప్ప మరెందుకు కాదు,” అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 


Related Post