వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతి?

March 15, 2019


img

ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడిన వైఎస్ వివేకానందరెడ్డి తల, శరీరంపై కొన్ని చోట్ల తీవ్రగాయాలైనట్లు గుర్తించిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం ఆయన పులివెందులలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఈరోజు ఉదయం వరకు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఉదయం పనివాళ్లు వచ్చి చూసినప్పుడు ఆయన బాత్రూములో రక్తపుమడుగులో పడి ఉన్నారని కృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన శవాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఆయన బాత్రూములో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి కింద పడిపోయినప్పుడు నుదుటికి, శరీరానికి దెబ్బలు తగిలాయా లేక ఎవరైనా ఆయనను హత్య చేసి బాత్రూములో పడేశారా? అనేది పోస్ట్ మార్టం నివేదిక వస్తే గానీ తెలియదు. ఈ వార్త తెలియగానే వైసీపీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన పులివెందులకు బయలుదేరారు.


Related Post