తెరాస ఎంపీలకు గాంధీభవన్‌ తలుపులు తెరిచియేయున్నవి

March 14, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తెరాస సిట్టింగ్ ఎంపీలలో జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, పొంగులేటిలను కేసీఆర్‌ పక్కనపెడుతున్నారనే వార్తలతో కాంగ్రెస్ పార్టీ  అప్రమత్తమైంది. ఒకవేళ కేసీఆర్‌ నిజంగా వారికి టికెట్లు నిరాకరిస్తే వారిలో జితేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. వారిని కేసీఆర్‌ నిజంగానే పక్కనపెట్టబోతున్నారా? పెడితే వారు తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరిస్తారా..లేదా? అనే విషయం త్వరలోనే స్పష్టం అవుతుంది. 

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో టిటిడిపి పోటీ చేస్తుందో లేదో తెలియదు. పార్టీ పోటీ చేసినా చేయకపోయినా నామా నాగేశ్వరరావు మాత్రం పోటీ చేయాలనుకొంటున్నారు. ఒకవేళ టిడిపి పోటీ చేయదలచుకోకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేయాలనుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక వారి ముగ్గురి కోసం కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌ తలుపులు తెరిచి ఉంచింది. 

కాంగ్రెస్‌ తన అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తే దానిని బట్టి తమ జాబితా ప్రకటించాలని సిఎం కేసీఆర్‌, ఆయన ప్రకటిస్తే దానిని బట్టి తమ అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఎదురుచూపులు చూస్తుండటం కామెడీగా ఉంది.


Related Post