ఫిబ్రవరి నెలాఖరులోగా హైటెక్ సిటీకి మెట్రో షురూ

February 20, 2019


img

హైదరాబాద్‌ నగరవాసులు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో సర్వీసులు ఈ నెలాఖరులోగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ కారిడార్లో అన్ని పనులు పూర్తయినప్పటికీ మెట్రో రైల్ సేఫ్టీ అధికారుల పర్యటన ఆలస్యం అవడంతో మెట్రో సేవలు కూడా ఆలస్యం అవుతున్నాయి. డిల్లీ నుంచి కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ రామ్ కృపాల్ నేతృత్వంలో ఒక బృందం మంగళవారం హైదరాబాద్‌ చేరుకొని, అమీర్‌పేట-హైటెక్‌ సిటీ కారిడార్‌కు సంబందించిన సివిల్‌ వర్క్‌, ఎలక్ర్టికల్‌, సిగ్నలింగ్‌, ట్రెయిన్‌ కంట్రోల్‌, టెలికమ్యూనికేషన్‌ మొదలైన అన్ని అంశాలను పరిశీలించడం మొదలుపెట్టింది. మరొక రెండు మూడు రోజులలో వారి పరిశీలన పూర్తవుతుంది. ఆ తరువాత వారు డిల్లీ వెళ్ళి  క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి వారం రోజుల సమయం పట్టవచ్చు. కనుక ఈనెలాఖరులోగా అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో సర్వీసులు ప్రారంభం కావచ్చు. 

అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మద్య కేవలం 10 కిమీ దూరం మాత్రమే ఉన్నప్పటికీ, ఆ మార్గంలో అనేక మలుపులు కలిగి ఉండటం, హైటెక్ సిటీ వద్ద మలుపు తిరిగే అవకాశం లేకపోవడంతో ఈ మార్గాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయవలసి వచ్చింది. ఈ సమస్యను అధిగమించడానికి ట్విన్ సింగిల్-లైన్ విధానంలో మెట్రో రైళ్లను నడిపించాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా డిజైనింగ్, ప్లానింగ్ చేయించారు. గత నెలన్నర రోజులుగా ఈ మార్గంలో ట్రయల్ రన్స్ నడుపుతూ, ఎదురైన అన్ని లోపాలను మెట్రో అధికారులు చక్కదిద్దారు కనుక మెట్రో రైల్ సేఫ్టీ అధికారుల బృందం త్వరలోనే క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ చేయవచ్చు. అది రాగానే అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయి.


Related Post