ఈడి విచారణపై రేవంత్‌ రెడ్డి ఏమన్నారంటే...

February 20, 2019


img

ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా పేర్కొనబడిన కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)అధికారులు మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. మళ్ళీ ఈ రోజు కూడా విచారణకు హాజరుకావలసిందిగా కోరారు. 

నిన్న జరిగిన విచారణలో తెరాస నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఆ సొమ్ము ఎవరిది? స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన మరో రూ.4.5 కోట్లు ఎవరు ఎక్కడి నుంచి ఏర్పాటు చేయాలనుకొన్నారు? అనే అంశంపైనే ప్రధానంగా విచారణ జరిగింది. రేవంత్‌ రెడ్డి చెపుతున్న జవాబులలో నిజానిజాలు నిర్ధారించుకోవడానికి ఆదాయపన్ను శాఖ అధికారులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. రేవంత్‌ రెడ్డితో తనతోపాటు తన ఛార్టెడ్ అకౌంటెంట్ ను కూడా వెంటబెట్టుకు వచ్చారు కానీ ఈడీ అధికారులు ఆయనను లోనికి అనుమతించలేదు. ఈరోజు మరింత లోతుగా రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించడం తధ్యం కనుక విచారణ తరువాత రేవంత్‌ రెడ్డిని అదుపులో తీసుకొంటారా లేక విచారణను వాయిదా వేస్తారా? చూడాలి. 

ఈడి విచారణ ముగిసిన తరువాత రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే కేంద్ర దర్యాప్తుసంస్థల ద్వారా నన్ను ఈవిధంగా వేధిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ అవినీతిపాలనను నేను ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను కనుకనే ప్రధాని మోడీతో కలిసి నాపై ఈవిధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ కేసుకు సంబందించి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసిన తరువాత మళ్ళీ ఈడి నన్ను ప్రశ్నించడం ఏమిటి? మోడీ-కేసీఆర్‌లది విడదీయలేని ఫెవీకాల్ బంధం. కొడంగల్ నుంచి నాపై పోటీ చేసిన తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి వద్ద ఎన్నికల సమయంలో రూ.51 లక్షలు పట్టుబడినప్పటికీ ఆయనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కానీ కేసీఆర్‌ను వ్యతిరేకించే నావంటివారిపై కేసులు నమోదు చేస్తుంటారు. అంటే మీవాళ్ళకొక రూలు మాకు వేరే రూలా?నన్ను ఎంతగా వేధించినప్పటికీ నేను భయపడబోను...వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు. నా తల తెగిపడినా కేసీఆర్‌ అక్రమాలను నిలదీస్తూనే ఉంటాను. ఏదో ఒకరోజు కేసీఆర్‌ జైలుకు వెళ్ళకతప్పదు,” అని అన్నారు.


Related Post