నేను అద్భుతాలు చేయలేను: ప్రియాంకా

February 19, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా వాద్రాను ఏఐసిసి కార్యదర్శిగా నియమించి, లోక్‌సభ ఎన్నికలలో తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె యూపీలో కాంగ్రెస్‌ బాధ్యతలు భుజాన వేసుకొని పనిచేస్తున్నారు. సోమవారం ఆమె బుందేల్‌ఖండ్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ, “నేను ఒక్కదానినే పైనుంచి అద్భుతాలు చేయలేను. నాకు మీ అందరి సహాయసహకారాలు చాలా అవసరం. పార్టీని గెలిపించుకోవాలంటే బూత్ స్థాయి నుంచి బలంగా ఉండాలి. అందరూ కష్టపడి పనిచేయాలి,” అని చెప్పారు. 

ఎవరూ ఊహించని విధంగా రాహుల్ గాంధీ ఆమెను హటాత్తుగా ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకువచ్చినప్పుడు, కాంగ్రెస్‌ నేతలు ఆమెను ట్రంప్ కార్డుగా, మోడీపై సందించిన బ్రహ్మాస్త్రంగా అభివర్ణించారు. ఆమె ఒక్కరే మోడీని డ్డీకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారన్నట్లు మాట్లాడారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీని పోలి ఉండటమే అందుకు కారణం. కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ పుట్టిల్లు వంటిదే అయినప్పటికీ, గత మూడు దశాబ్ధాలుగా యూపీలో అధికారంలోకి రాలేకపోతోంది. కనుక ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంకా వాద్రాను రంగంలో దించినట్లయితే ఆమె యూపీలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగలరని రాహుల్ గాంధీ ఆశపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించడానికి తన వద్ద మంత్రదండం ఏమీ లేదని, బూత్ స్థాయి నుంచి పార్టీ బలంగా ఉంటేనే సత్ఫలితాలు సాధించగలమని ఆమె చెప్పడం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోంది. ఆమె రాకతో యూపీలో అద్భుతాలు జరుగకపోయినా, ఎస్పీ-బీఎస్పీ కూటమిని, అధికార బిజెపిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకొనే అవకాశం ఉంది.    



Related Post