పుల్వామా దాడిపై భారత్ తొలి ప్రతిచర్య

February 16, 2019


img

జమ్ముకశ్మీర్‌లో పుల్వామా జాతీయ రహదారిపై ప్రభుత్వానికి ప్రేరిత ఉగ్రవాది దాడిలో 40 మంది సైనికులు చనిపోగా మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత సర్కార్ మొదటి ప్రతిచర్యగా పాకిస్థాన్‌కు అత్యంత ప్రాధాన్య దేశం(మోస్ట్ ఫేవర్డ్ నేషన్) హోదాను రద్దు చేసింది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీ (పన్ను) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. 

పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు ప్రధానంగా పండ్లు, సిమెంటు, ముడి ఖనిజము, పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి అవుతుంటాయి. వాటి విలువ ఏడాదికి సుమారు రూ.3,500 కోట్లు వరకు ఉంటుంది. ఇప్పటి వరకు పళ్ళపై సుమారు 50 శాతం, సిమెంటుపై 7.5 శాతం పన్ను ఉండేది. అదిప్పుడు ఒకేసారి 200 శాతానికి పెంచడంతో పాకిస్థాన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. పాకిస్థాన్‌కు బుద్ది చెప్పేందుకు మరిన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు అరుణ్‌జైట్లీ తెలిపారు. పాకిస్థాన్‌ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై దాడులు కూడా ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. వారిపై ఎప్పుడు, ఎక్కడ, ఏవిధంగా దాడి చేయాలనేది భారత ఆర్మీ నిర్ణయిస్తుందని చెప్పారు.


Related Post