నిజామాబాద్‌లో రోడెక్కిన రైతన్నలు

February 16, 2019


img

నిజామాబాద్‌ జిల్లా పేరు చెప్పగానే మొదట గుర్తుకువచ్చేది అక్కడి పసుపు పంటలే. అయితే ఆ పసుపు పండించే రైతుల జీవితాలు ఎప్పుడూ ఒడిదుడుకులకు లోనవుతూనే ఉన్నాయి. ఎంతో శ్రమించి పంట పండించి మార్కెట్లకు తీసుకువస్తే అక్కడ దళారులు, వ్యాపారులు అందరూ కలిసి పసుపు రైతులను ముంచుతుంటారు. జిల్లాలో ఎర్రజొన్న పండించే రైతుల పరిస్థితి కూడా అదే. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా వారి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. పసుపు, ఎర్రజొన్నలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని కోరుతూ గత నెలరోజులుగా రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

గత 15 రోజులలోనే పసుపు, ఎర్రజొన్న రైతులు రెండుసార్లు ధర్నాలు చేసి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు కానీ ప్రయోజనం లేకపోవడంతో శనివారం ఉదయం నుంచి రోడ్లపైనే వంటలు చేసుకొని తింటూ నిరసనలు తెలిపారు. కొన్ని ప్రధాన కూడళ్ళలో రైతులు రోడ్లపై అడ్డుగా పడుకొని నిరసనలు తెలియజేశారు. పసుపుకు కనీస మద్దతుధర క్వింటాలుకు రూ.15,000, ఎరజొన్నలకు క్వింటాలుకు రూ.3,500 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే మరింత తీవ్రంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.


Related Post