పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాలు

February 15, 2019


img

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జాతీయరహదారిపై గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో 40 మంది సైనికులు  చనిపోగా మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ లోని జైష్-ఏ-మహమ్మద్ సంస్థ ప్రకటించుకొంది. 

ఈ ఘటనపై కేంద్రప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది. భారత్ పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తునందుకు ఆ దేశానికి ఇచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను రద్దు చేయాలని నిర్ణయించుకొన్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రకటించారు. 

ప్రధాని నరేంద్రమోడీ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఈ దాడికి బాధ్యులైనవారిని ఎవరినీ విడిచిపెట్టబోమని, వారిని ఏవిధంగా ఎక్కడ మట్టుబెట్టాలో నిర్ణయించుకొనే హక్కు, అధికారం సైన్యానికే ఇస్తూ అందుకు అవసరమైన అనుమతి మంజూరు చేస్తున్నానని ప్రకటిచారు. నిఘా వైఫల్యం వలననే ఉగ్రవాదులు దాడి చేయగలిగినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఈ దాడికు ప్రధాన సూత్రధారి పాకిస్థాన్‌కు చెందిన కమ్రాన్ అని గుర్తించారు. ఈ దాడితో సంబందమున్నట్లు అనుమానిస్తున్న ఏడుగురు వ్యక్తులను పుల్వామా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.    

ఈ దాడిలో అత్యంత శక్తివంతమైన 80 కేజీల ఆర్.డి.ఎక్స్. ప్రేలుడు పదార్ధాన్ని వాడినట్లు గుర్తించారు. దానిని ఒకేసారి సేకరించడం, తరలించడం చాలా కష్టం కనుక గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌ నుంచి కొద్దికొద్దిగా పుల్వామాలోకి తీసుకువచ్చి ఉండవచ్చని దర్యాప్తు సంస్థ అధికారులు భావిస్తున్నారు. 

దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రదాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో అందుకు సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. ఒక్క చైనా తప్ప అమెరికాతో సహా పలుచేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. 

ప్రధాని స్పందనను బట్టి త్వరలోనే భారత్ ఆర్మీ మరోసారి ప్రభుత్వానికి భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.




Related Post