సిద్దిపేటలో నకిలీనోట్ల ముఠా అరెస్ట్

February 15, 2019


img

సిద్దిపేటలో గత 5-6 నెలలుగా గుట్టుగా నకిలీనోట్లను ముద్రించి మార్కెట్లో చలామణీ చేస్తున్న ఒక ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో  సిద్దిపేటకు చెందిన గ్యాదరి బాలకృష్ణ, మద్దూరుకు చెందిన ఓ స్థానిక ఫోటో స్టూడియో నిర్వాహకుడు చింతల హరినాధ్, పల్లెపు సాయికుమార్‌, జాలపల్లికి చెందిన గిరి గోవర్ధన్‌రెడ్డి, బోయగూడకు చెందిన అశోక్, గాగిల్లాపూర్‌కు చెందిన సుంకోజి శ్రీశైలం, బోయి గల్లీకి చెందిన సురేశ్, కూటిగల్‌కు చెందిన బండి రఘులు ఉన్నారు.

వీరందరూ కలిసి సిద్దిపేటలోని అంబేడ్కర్‌నగర్‌లోని బాలకృష్ణ ఇంట్లో ముద్రిస్తున్న నకిలీ నోట్లను మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ మీడియాకు తెలిపారు. రూ.3.50 లక్షలు విలువగల రూ. 200,500,2,000 నకిలీ నోట్లను ముద్రించారని, వాటిలో రూ.89,200లను స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, కటింగ్ మెషీన్, మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. మార్కెట్లో నకిలీ నోట్లను చలామణి చేసి సేకరించిన రూ.1.80 లక్షలు విలువగల అసలు కరెన్సీని కూడా స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. ఈ పధకానికి అసలు సూత్రధారి గ్యాదరి బాలకృష్ణ నంగునూరు ప్రజావైద్యశాల (పి.హెచ్.సి.)లో అటెండరుగా పనిచేస్తున్నాడని సిద్దిపేట పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ మీడియాకు తెలిపారు. అందరినీ అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించామని, ఇవాళ్ళ వారీనందరినీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.


Related Post