దటీజ్ కేసీఆర్‌

February 13, 2019


img

పాలకులందరూ పాలిస్తారు... చట్టాలు చేస్తారు.. అభివృద్ధి పనులు చేస్తుంటారు...కొత్త కొత్త సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతుంటారు. కానీ వారిలో చాలామందికి తపన, చిత్తశుద్ధి, ముందుచూపు ఉండవు కనుక అవన్నీ మొక్కుబడిగానే సాగిపోతుంటాయి. కానీ తెలంగాణ సిఎం కేసీఆర్‌ తీరే వేరు. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి తదనుగుణంగా ‘టైలర్-మేడ్’ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి వాటిని నూటికి నూరు శాతం ఖచ్చితంగా అమలయ్యేలా చేస్తుంటారు. కేసీఆర్‌ కిట్స్, కళ్యాణ లక్ష్మి, బతుకమ్మ చీరలు, మిషన్ కాకతీయ, చెరువులలో చేపల పెంపకం, రాయితీపై గొర్రెల పంపిణీ, రైతుబంధు, రైతుభీమా, కంటివెలుగు, కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్...ఇలా చెప్పుకొంటూపోతే చాలానే ఉన్నాయని అందరికీ తెలుసు. వాటి స్పూర్తితో కేంద్రప్రభుత్వంతో సహా దేశంలో వివిద రాష్ట్రాలు ఆ పధకాలను అమలుచేస్తుండటమే అవి ఎంత విజయవంతమయ్యాయో తెలియజేస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.   

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలలో ‘హరితహారం’ కూడా ఒకటి. ఏటా క్రమం తప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలను నాటించి చేతులు దులుపుకోకుండా వాటి సంరక్షణకు కూడా తగిన ఏర్పాటు చేయడం వలన రాష్ట్రంలో మళ్ళీ పచ్చదనం కనిపిస్తోంది. 

ఒకపక్క హరితహారాన్ని కొనసాగిస్తూనే మరోపక్క రాష్ట్రంలో అడవులను, వాటిలోని జంతువులు, పక్షులను కూడా సంరక్షించాలని సిఎం కేసీఆర్‌ సంకల్పించారు. అడవులలో చెట్లు నరికేవారిని, జంతువులను వేటాడేవారిపై చర్యలు తీసుకొనేందుకు చట్టంలో శిక్షలున్నాయి కానీ అవి సమర్ధంగా అమలుచేయకపోవడం వలననే దుండగులు యధేచ్చగా చెట్లు నరుకుతున్నారు. చర్మాలు, మాంసం కోసం జంతువులను, పక్షులను వేటాడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే మరింత కటినమైన పహారా, కటినమైన శిక్షలు ఉండాలనే సిఎం కేసీఆర్‌ సూచనమేరకు రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు అటవీచట్టం-2019ని రూపొందిస్తున్నారు. అది అమలులోకి వస్తే ఇకపై చెట్లు నరికేవారికి, జంతువులను వేటాడేవారికి 3-10 ఏళ్ళు వరకు జైలు ఊచలు లెక్కించవలసి వస్తుంది. గ్రామ, జిల్లా స్థాయిలో పలువురికి అటవీ రక్షణ బాధ్యతలు అప్పగించేలా చట్టంలో నిబందనలు రూపొందిస్తున్నారు. త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో ఈ అటవీచట్టం-2019బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

సాధారణంగా అటవీ, పర్యాటక, స్త్రీశిశుసంక్షేమ వంటి శాఖలను అప్రధాన్యశాఖలనే దురాభిప్రాయం ఉంది. కానీ పనిచేయాలనే తపన, చిత్తశుద్ధి, దూరదృష్టి ఉంటే ఏ శాఖలోనైనా ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయవచ్చో సిఎం కేసీఆర్‌ చేసి చూపిస్తున్నారు. కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు, త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న మంత్రులు అందరూ కూడా సిఎం కేసీఆర్‌ స్పూర్తితో తమతమ శాఖలలో, నియోజకవర్గాలలో ఇదేవిధంగా పనిచేసినట్లయితే వారికీ కేసీఆర్‌లాగే మంచి పేరు వస్తుంది. రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలు కూడా సంతోషిస్తారు. 


Related Post