టికెట్ కోసం దరఖాస్తు చేసుకొన్న పార్టీ అధ్యక్షుడు!

February 13, 2019


img

మన రాజకీయ పార్టీలలో అంతర్గతంగా ప్రజాస్వామ్య పద్దతులు అమలుచేస్తున్నట్లే కనిపిస్తుంది కానీ అవి నేతి బీరకాయలో నెయ్యి వంటివేనని అందరికీ తెలుసు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఏర్పాటైన జనసేన మాత్రం ఇప్పటి వరకు ప్రజాస్వామ్య పద్దతులలోనే ముందుకు సాగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నప్పటికీ, టికెట్ల విషయంలో మాత్రం నిఖచ్చిగా ఉండాలని పవన్‌కల్యాణ్‌ నిర్ణయించారు. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కూడా అందరూ అభ్యర్ధులలాగే తన దరఖాస్తును అభ్యర్ధుల వడపోత కమిటీ అధ్యక్షుడు మాదాసు గంగాధరంకు మంగళవారం సమర్పించారు. పార్టీ టికెట్ల గురించి ఎవరూ పైరవీలు చేయనవసరంలేదని, పార్టీ, రాష్ట్రం కోసం కష్టపడి పనిచేసేగుణం, నిబద్దత, రాజకీయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుందని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. 

ప్రస్తుతం మన రాజకీయ పార్టీలన్నీ కలిసి ఎన్నికల ప్రక్రియను ‌చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చేయడంతో కేవలం కోట్లు కుమ్మరించగలవారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయగలుగుతున్నారు. త్వరలో ఏపీలో జరుగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీలు హోరాహోరీగా పోరాడబోతున్నాయి. రెంటికీ పుష్కలంగా అర్ధబలం, అంగబలం ఉన్నాయి కనుక ఎన్నికలలో ధనప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో ఎవరూ ఊహించలేరు. వాటి మద్యలో జరిగే భీకరపోరులో జనసేనపార్టీ డబ్బు ఖర్చు పెట్టలేని సామాన్య నేతలను, కార్యకర్తలను పోటీకి పెడితే ఏమి జరుగుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు.


Related Post