ప్రతిపక్ష ఎంపీలు మూకుమ్మడి రాజీనామా?

February 13, 2019


img

రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు కేంద్రప్రభుత్వం నిరాకరిస్తుండటంతో కాంగ్రెస్‌తో సహా బిజెపియేతర 120 మంది ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరి రోజున మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీలు మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఇతర పార్టీలతో కూడా చర్చించి దీనిపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేసి మోడీ ప్రభుత్వానికి నిరసన తెలుపుతారు. 

ప్రతిపక్షపార్టీలలో ఒక్కో పార్టీకి ఒక్కో కారణంతో ఈ రాజీనామాల ఆలోచన చేస్తున్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్‌ రాఫేల్ యుద్దవిమానాల అంశాన్ని హైలైట్ చేసి దాని నుంచి ఎన్నికలలో రాజకీయ మైలేజీ పొందడానికి, ఏ‌పీలో టిడిపికి గట్టి సవాలు విసురుతున్న జగన్మోహన్ రెడ్డిపై పైచేయి సాధించడానికి చంద్రబాబునాయుడు, శారదా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్స్ కుంభకోణాలపై దర్యాప్తు పేరుతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందనే కోపంతో మమతా బెనర్జీ…ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో ఈ మూకుమ్మడి రాజీనామాలకు సిద్దం అవుతున్నారని చెప్పవచ్చు. 

పార్లమెంటుకు ఇవే చివరి సమావేశాలు కనుక వారి రాజీనామాల వలన మోడీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు కానీ 120 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామాలు చేయడం వలన మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలలో దురాభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ప్రతిపక్షాలు అదే కోరుకొంటున్నాయి.


Related Post