తరువాత రేవంత్‌ రెడ్డి వంతు

February 13, 2019


img

ఓటుకు నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. మంగళవారం కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి, ఆయన ఇద్దరు కుమారులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), ఆదాయపన్ను శాఖ (ఐ‌టి) అధికారులు సుమారు 6 గంటలపాటు విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మేము ఈడీ, ఐ‌టి అధికారులకు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాము. ఈ కేసుతో నాకు, నా ఇద్దరు కొడుకులకు ఎటువంటి సంబందమూ లేదు. కానీ రాజకీయ కుట్రలో భాగంగానే మమ్మల్ని ఇరికించారు. ఈ కేసును ఈడీ జోక్యం చేసుకోవడం చూస్తే కేసును కేంద్రప్రభుత్వానికి అప్పగించినట్లు అనుమానం కలుగుతోంది. తెరాస నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎవరివో న్యాయస్థానంలో తేలుతుంది. మేము నిర్ధోషులమైనప్పటికీ ఈడీ మళ్ళీ విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతాము,” అని చెప్పారు. 

ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా పేర్కొనబడిన తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి, ఆయన అనుచరుడు ఉదయ్ సింహాలకు ఈనెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది.  

సుమారు మూడున్నరేళ్ళ క్రితం ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా వేం నరేందర్‌రెడ్డి పోటీ పడ్డారు. ఆయనకు మద్దతు ఈయవలసిందిగా కోరుతూ రేవంత్‌ రెడ్డి, ఉదయ్ సింహాలు తెరాస నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వజూపారు. ఆయన మద్దతు ఇవ్వడానికి అంగీకరిస్తే తరువాత మరో రూ.4.50 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఈవిషయం ఆయన ముందుగానే ఏసీబికి తెలియజేయడంతో వారు వలపన్ని రేవంత్‌ రెడ్డి, ఉదయ్ సింహాలను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.


Related Post