సిరిసిల్లాలో మ్యూజికల్ ఫౌంటెన్

February 12, 2019


img

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. జిల్లాల పునర్వ్యస్థీకరణ అనంతరం అవి మరింత వేగంపుంజుకొన్నాయి. అభివృద్ధి పనులలో భాగంగా రాష్ట్రంలోని చెరువులు, పార్కుల సుందరీకరణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్‌ గత ప్రభుత్వంలో చేనేత, పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖల మంత్రిగా వ్యవహరించడం జిల్లాకు బాగా కలిసివచ్చిందనే చెప్పవచ్చు. ఒకపక్క జిల్లాలోని చేనేత, మరమగ్గం కార్మికులకు, పరిశ్రమలకు యధాశక్తిన తోడ్పడుతూనే, మరోపక్క సిరిసిల్ల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. సిరిసిల్లలో ఆపెరల్ పార్కు ఏర్పాటుకు కేటీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తుండటంతో త్వరలోనే అది ఏర్పాటవబోతోందని కేటీఆర్‌ చెప్పారు. సిరిసిల్లలో ఆపెరల్ పార్కును ఏర్పాటు చేసి మరో తిరుపూర్‌గా అభివృద్ధి చేస్తానని కేటీఆర్‌ చెప్పారు. దీనిలో సుమారు 10,000 మంది మహిళలకు ఉపాది అవకాశాలు లభిస్తాయని కేటీఆర్‌ తెలిపారు. 

సిరిసిల్ల పట్టణం సుందరంగా తీర్చిదిద్దేందుకు కేటీఆర్‌ చేసిన కృషి ఫలించడంతో సిరిసిల్లకు కొత్త సొగసులు వచ్చాయి. సిరిసిల్లలో బతుకమ్మ ఘాట్ ను సుందరంగా తీర్చి దిద్ది అక్కడ మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేయించారు. పట్టణ ప్రజలు సేద తీరేందుకు ఇందిరా పార్కును చక్కగా తీర్చిదిద్దారు.


పట్టణ ప్రజలు అందరూ వినియోగించుకునేందుకు ఓపెన్ జిమ్ సెంటరును ఈరోజు కేటీఆర్‌ ప్రారంభించారు. ఒకప్పుడు అపరిశుబ్రతకు నిలయంగా ఉండే శ్మశానవాటికను  వైకుంఠధామం పేరిట సుందరంగా తీర్చిదిద్దారు.నేతన్నల కోసం ఏకలవ్య కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేశారు. పట్టణంలోని పేదలకు రూ.5కే భోజనం అందించేందుకు అన్నపూర్ణా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. పట్టణంలో తడి,పొడి చెత్తను సేకరించేందుకు కాలుష్య రహితమైన బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేశారు.


Related Post