ఆమె వద్ద మంత్రదండం లేదు కదా? ప్రశాంత్ కిషోర్

February 12, 2019


img

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించాలి. ముఖ్యంగా అత్యధిక (80) ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ గెలుచుకోవాలి. అందుకోసమే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా వాద్రాను ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకువచ్చి, యూపీ బాధ్యతలు అప్పగించారు. 

ఆమెకు యూపీలో మంచి ప్రజాధారణ ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఆమె వద్ద మంత్రదండమేమీ లేదని, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనేక మంది ప్రధానకార్యదర్శులలలో ఒకరైన ఆమె వలన కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చునని ఎన్నికల వ్యూహ నిపుణుడు, జెడియు ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. 

ఆయన మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమెను యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రాజకీయాలలోకి తీసుకువచ్చి ఉండి ఉంటే, లోక్‌సభ ఎన్నికలనాటికి ఆమె శక్తిసామర్ధ్యలను ప్రజలు కూడా అంచనా వేయగలిగి ఉండేవారని, ఆమె కూడా రాజకీయ పరిణతి సాధించి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహాయపడగలిగి ఉండేవారని అన్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయినా భవిష్యత్తులో బిజెపికి ఎన్డీయే కూటమికి గట్టి సవాలు విసరగలరని భావిస్తున్నానని అన్నారు.


Related Post