రేపు ప్రధాని మోడీ గుంటూరు పర్యటన... ఏమి జరుగుతుందో?

February 09, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం గుంటూరు పర్యటనకు వస్తున్నారు. గుంటూరులో పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తారు. పూర్తయిన వాటిని ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాదరంగా స్వాగతం పలికి, ప్రధానితో పాటు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం పద్దతి. కానీ బిజెపి, కేంద్రంతో టిడిపి తెగతెంపులు చేసుకొన్నాక ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీపై రాజకీయ యుద్ధం ప్రకటించడంతో, ఏపీ పర్యటనకు వచ్చే బిజెపి అగ్రనేతలకు, కేంద్రమంత్రులకు చాలా‌ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు ఓ బహిరంగసభలో పాల్గొనవలసి ఉంది. కానీ సభకు జనాలు కరువవడంతో సభను రద్దు చేసుకొని వెళ్ళిపోయారు.

రేపు ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎదురైతే బిజెపికి చాలా అవమానకరంగా మారుతుంది. కనుక రాష్ట్ర బిజెపి నేతలు జనసమీకరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం గుంటూరుకు చెందిన ఒక సీనియర్ వైకాపా నేత సహాయ సహకారాలు తీసుకొంటున్నట్లు సమాచారం. ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోడీకి కనీసం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికైనా వస్తారా లేక మంత్రులనో అధికారులనో పంపించి నిరసన తెలియజేస్తారా? చూడాలి. చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 11న డిల్లీలో ధర్మపోరాటదీక్ష చేయబోతున్నారు. కనుక ఆ వంకతో ప్రధాని నరేంద్రమోడీ విజయవాడ చేరుకొనేటప్పటికీ డిల్లీ వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు.


Related Post