జనగామలో కాంగ్రెస్‌ మటాష్ : కంచె రాములు

February 09, 2019


img

కాంగ్రెస్ పార్టీ గురించి ఇదివరకు తెరాస, బిజెపి నేతలు రకరకాల వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేసేవారు కానీ వారికి ఆ శ్రమలేకుండా ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలే తమ తోటి కాంగ్రెస్ నేతల గురించి, పార్టీ గురించి చులకనగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో లాబీయింగ్ చేసుకోగలిగినవారికే పార్టీలో గుర్తింపు, గౌరవం, పదవులు, అధికారం లభిస్తాయని, కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు ఉండదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవలే అన్నారు. 

తాజాగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకాలపై కూడా పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా తనను కాదని ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వరరావును నియమించినందుకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీసీసీ ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో కష్టపడేవారి కంటే పార్టీలు మారేవారికి, ఎన్నికల ముందు వచ్చి చేరినవారికే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం లభిస్తుందని రేగా కాంతారావు అన్నారు. 

జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా జంగా రాఘవరెడ్డిని నియమించడంపై పీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కంచె రాములు స్పందిస్తూ, “ఇక జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. వేరే జిల్లాకు చెందిన జంగా రాఘవరెడ్డికి స్థానిక నేతలు, కార్యకర్తలతో సత్సంబంధాలు లేవు. రాష్ట్రంలో కొందరు కాంగ్రెస్‌ పెద్దలకు చెంచాగిరీ చేసి ఆ పదవి సంపాదించుకున్నాడు. ఆయన వలన జిల్లాలో పార్టీకి నష్టమే తప్ప మేలు జరుగదు. కనుక ఆయన నియామకంపై కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచించాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

ఈవిదంగా కాంగ్రెస్‌ నేతలే తమ పార్టీ గురించి, పార్టీలో సహచర నేతల గురించి మీడియా ముందుకు వచ్చి ఈవిధంగా మాట్లాడుతుంటే, ఇక ప్రజలకు వారిని కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్ముతారు?


Related Post