ఇంకా మైండ్ గేమ్స్ ఎందుకు?

January 19, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ సిఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ముందుగా నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలుపుకొంటున్నాను. ఈరోజు శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం కాపీ-పేస్ట్ లాగ సాగింది తప్ప కొత్తదనం కనిపించలేదు. తెరాస ప్రభుత్వం గత నాలుగేళ్ళలో అమలుచేయని హామీల గురించి, వాటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశం ఆయన ప్రసంగంలో లేదు. అలాగే నిరుద్యోగ భృతి, పెన్షన్ల గురించి ప్రస్తావన లేదు. ఆయన ప్రసంగం ఎన్నికల ప్రసంగంలాగ సాగిపోయింది. శాసనసభలో మేము ప్రజాసమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాము, ” అని అన్నారు.

కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈరోజు సిఎం కేసీఆర్‌ను కలవడం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇంకా మాతో మైండ్ గేమ్స్ ఎందుకు ఆడుతోందో తెలియదు. మా పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోనున్నారని తెరాస నేతలు ప్రచారం చేస్తూ మా ఎమ్మెల్యేల మనోధైర్యం దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు కానీ మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా బలహీన మనస్కులు కాదు. ప్రలోభాలకు లొంగిపోయేవారు కాదు,” అని మల్లు భట్టివిక్రమార్క అన్నారు.


Related Post