ఆరోవిల్లీ గురించి ఎప్పుడైనా విన్నారా?

January 19, 2019


img

నాలుగు రోజులు శలవులు దొరకగానే అందరూ విహారయాత్రలకని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు కానీ మనదేశంలోనే ఉన్న ఒక అద్భుతమైన చిన్న అంతర్జాతీయ పట్టణం ఆరోవిల్లీ గురించి తెలిసినవారు చాలా తక్కువమందే ఉంటారు. దీని ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. 

ఈ పట్టణంలో అనేకదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారున్నారు. మళ్ళీ వారి సంతానం కూడా అక్కడే పుట్టి పెరిగి పెద్దవారైనవారున్నారు. అలాగే అనేక రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన భారతీయులు కూడా ఉన్నారు. ఆరోవిలీలో ఎటువంటి కులాలు, మతాలు, చట్టాలు, నియమనిబందనలు ఉండవు. ఏ కులమతాలకు సంబందించిన పూజలు ప్రార్ధనలు చేయాలనే ఒత్తిడి ఉండదు. అక్కడ ఉండే ‘మైత్రిమందిర్’ లో అందరూ కలిసి నిశబ్ధంగా ధ్యానం చేసుకొంటారు. అదే వారు చేసే ఏకైక పూజ. 

ఆరోవిల్లీలో వివిద దేశాలకు చెందిన భిన్నజాతుల ప్రజలు కలిసి జీవిస్తున్నప్పటికీ వారిమద్య ఎటువంటి ఘర్షణలు జరుగవు. నేరాలు జరుగవు. కనుక పోలీస్ స్టేషన్ కూడా ఉండదు. 

మరో విశేషమేమిటంటే అక్కడ ఎవరికి వచ్చిన పనివారు చేసుకొంటారు కానీ అందరికీ సమానవేతనమే లభిస్తుంది. ఆ పట్టణంలో ఎవరు ఏపనిచేసీనా సరే వారికి నెలకు రూ.12,000 జీతం మాత్రమే లభిస్తుంది. అంతేకాదు... అక్కడ నగదు లావాదేవీలు జరుగవు. ఎవరైనా ఒక వస్తువును లేదా సేవను పొందినట్లయితే వారి బ్యాంక్ ఖాతా నెంబరును ఇస్తుంటారు. దాని నుంచి నగదు బదిలీ అయిపోతుంది. అంతే! 

ఇన్ని విశిష్టతలున్న ఈ ఆరోవిల్లీ పట్టణం కొత్తగా ఏర్పడినదనుకొంటే పొరపాటే. ఫ్రాన్స్ దేశస్థురాలైన మిర్ర అల్ఫాసా అనే మహిళ కులమతబాషాప్రాంతాలకు అతీతంగా అంతర్జాతీయ సమాజం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. భారత ప్రభుత్వం మరియు యునెస్కో సహాయసహకారాలతో  ఆమె 1968 సంవత్సరంలో వివిద దేశాలకు చెందిన 5,000 మందితో ఈ ఆరోవిల్లీ పట్టణాన్ని ఏర్పాటు చేశారు. ఈ 50 సంవత్సరాలలో ఆరోవిల్లీ జనాభా 50,000 కు చేరుకొంది.  

సముద్రతీరానికి ఆనుకొని ఉన్నందున ఆ పట్టణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. గడిచిన 50 ఏళ్ళలో అక్కడ స్థిరపడినవారందరూ కలిసి అక్కడ పచ్చదనం, పరిశుభ్రత పెంచి, అనేక అద్భుతమైన కట్టడాలు నిర్మించడంతో ఇప్పుడు ఆరోవిల్లీ ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. దాని వలన కూడా ఆరోవిల్లీవాసులకు భారీగా ఆదాయం లభిస్తోంది. అయినప్పటికీ వారు పరిమితమైన నిధులతో, పరిమితమైన జీవనవిధానాలతో చాలా హాయిగా జీవిస్తున్నారు. ఆరోవిల్లీ పట్టణం తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ చిన్న పట్టణం చెన్నైకి 150 కిమీ దూరంలో, పాండిచ్చేరి నుంచి 10 కిమీ దూరంలో ఉంది. చెన్నై నుంచి ఆరోవిల్లీకి బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఆరోవిల్లీవాసులు నిర్వహించే క్యాబ్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఆరోవిల్లీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగోరేవారు https://www.auroville.org/   వెబ్ సైటును సందర్శించవచ్చు. 


Related Post