తెరాసలో ఒంటేరు చేరికపై జగ్గారెడ్డి కామెంట్స్

January 19, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌తో తలపడి ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి నిన్న తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన చేరికను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్ధించడం విశేషం. శుక్రవారం సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఒంటేరు ప్రతాప్‌రెడ్డి వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోవడంతో ఆర్ధికంగా చితికిపోయారు కనుక చాలా బలహీనపడ్డారు. ఇంకా తెరాసతో పోరాడే శక్తి లేకనే ఆయన ఆపార్టీలో చేరిపోయారు. కనుక ఆయన చేరికను తప్పు పట్టలేము. రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకొని పార్టీలో కష్టపడుతున్నవారిని గుర్తించి గౌరవించకపోతే, ఆ విధంగా బలహీనపడిన నేతలు తెరాసలోకి వెళ్ళిపోతూనే ఉంటారు. కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న ‘లాబీయింగ్ విష సంస్కృతిని’ వదిలించుకోవాలి. నావంటివారు సైతం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నేరుగా కలిసేందుకు అవకాశం లేకుండా ఒక కోటరీ అడ్డుకొంటోంది. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్న ఇటువంటి పద్దతులు మారవలసిన అవసరం చాలా ఉంది,” అని అన్నారు. 

నకిలీ పాస్ పోర్టులపై కొందరు వ్యక్తులను అమెరికాకు అక్రమరవాణా చేసిన కేసులో జగ్గారెడ్డి ఎన్నికలకు ముందు జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత నుంచి ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఇకపై సిఎం కేసీఆర్‌పై విమర్శలు చేయనని, జిల్లా మంత్రుల ఆదేశాల ప్రకారం నడుచుకొంటానని ప్రకటించారు. తద్వారా ఆయన తెరాస విధేయుడినని చాటి చెప్పుకున్నారు. కనుకనే ఆయన ఒంటేరు తెరాసలో చేరికను సమర్ధిస్తూ, రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలను విమర్శిస్తూ మాట్లాడుతున్నారని భావించవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులలో జగ్గారెడ్డిపై చర్యలు తీసుకొంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయే ప్రమాదం ఉంది కనుక రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు ఆ విమర్శలను మౌనంగా భరించక తప్పదు. అయితే జగ్గారెడ్డి చెపుతున్న మాటలలో వాస్తవం ఉందనే సంగతి కాంగ్రెస్‌ పెద్దలకు కూడా తెలుసు.


Related Post