గోల్కొండ హోటల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశం

January 16, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు పైనే గడిచింది కానీ ఇంతవరకు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరుగలేదు. శాసనసభాపక్ష నేత ఎన్నిక కూడా జరుగలేదు. కానీ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నందున శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడం కోసం ఈరోజు రాత్రి 9 గంటలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో సమావేశమయ్యారు. ప్రస్తుతం వారి సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ సమక్షంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక జరుగుతుంది. 

కాంగ్రెస్ పార్టీ 119 స్థానాలకు పోటీ చేయగా కేవలం 19 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. కనుక పార్టీ నేతలలో...కార్యకర్తలలో నైరాశ్యం నెలకొంది. శాసనసభలో తెరాస బలం మరింత పెరిగినందున తెరాస ఆత్మవిశ్వాసం మరింత పెరుగగా, సభలో కాంగ్రెస్‌తో బలం తగ్గడంతో కాంగ్రెస్‌ సభ్యులలో ఆత్మన్యూనత ఏర్పడటం సహజమే కనుక శాసనసభలో తెరాసను ఎదుర్కోవడం కష్టమే. ఈ నేపద్యంలో కాంగ్రెస్‌తో శాసనసభాపక్ష నేతగా ఎవరు ఎన్నికైనప్పటికీ వారికి రోజూ సభలో అగ్నిపరీక్షగానే ఉంటుంది. మల్లు భట్టివిక్కమార్క లేదా దుద్దిళ్ల శ్రీధర్ బాబులలో ఎవరో ఒకరు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొనే అవకాశం ఉందని సమాచారం. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభాపక్ష నేత అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. 


Related Post