రేపటి నుంచే అర్ధకుంభమేళా

January 14, 2019


img

మంగళవారం నుంచి ప్రయాగ్ రాజ్‌ (అలహాబాద్)లో అర్ధకుంభమేళా మొదలవబోతోంది. మకర సంక్రాంతి సందర్భంగా రేపు (మంగళవారం) నుంచి మొదలయ్యే ఈ కుంభమేళా మహాశివరాత్రి (మార్చి 4)న ముగుస్తుంది. కనుక ఈ పవిత్ర సమయంలో గంగానదిలో పుణ్యం చేస్తే సకల పాపాలు హరించిపోయి మోక్షం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం. అందుకే ప్రతీ ఆరేళ్ళకు ఓసారి జరిగే ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ కుంభమేళాకు సుమారు 3-4 కోట్ల మంది భక్తులు వస్తుంటారు కనుక ఇది  ప్రపంచంలోనే అతిపెద్ద మేళాగా యునెస్కో గుర్తింపు పొందింది. 



మొదటిరోజున అంటే రేపు ఉదయం 5.15 నుంచి సాయంత్రం 4.20 గంటలవరకు గంగానదిలో జరిగే స్నానకార్యక్రమాలకు షాహీ స్నాన్ లేదా రాజయోగ స్నానం అంటారు. ఆ సమయంలో సామాన్య భక్తులను స్నానాలకు అనుమతించరు. ఈశాన్య రాష్ట్రాలలోని దట్టమైన అడవులలో నివసించే నాగ సాధువులు, యోగులు, అఘోరాలు మాత్రమే మొదట స్నానం చేసి పూజలు చేస్తారు. అనంతరం సామాన్య భక్తులను అనుమతిస్తారు. 


జనవరి 21 (పుష్య పౌర్ణమి), జనవరి 31 (పుష్య ఏకాదశి), ఫిభ్రవరి 4 (మౌని అమావాస్య), ఫిభ్రవరి 10 (మాఘ ఏకాదశి), ఫిభ్రవరి 19 మాఘ పౌర్ణమి, మార్చి 4 (శివరాత్రి) రోజులను ప్రత్యేకరోజులుగా పరిగణిస్తారు. సంక్రాంతి తరువాత ఆ 7 రోజులలో సాధువులు గంగానదిలో స్నానాలు చేస్తుంటారు. కనుక కుంభమేళా పూర్తయ్యేవరకు అక్కడే డేరాలు వేసుకొని ఉంటారు. ఆరేళ్ళకు ఒకసారి మాత్రమే ప్రజల మద్యకు వచ్చే వారు చేసే చిత్రవిచిత్రమైన విన్యాసాలను చూసేందుకు ప్రజలు ఎగబడుతుంటారు. ఒంటి నిండా విబూధి పూసుకొని వేలాదిమంది నాగసాధువులు హరహర మహాదేవ శంభో... అంటూ గట్టిగా శివనామస్మరణం చేస్తూ పూర్తి నగ్నంగా తరలివస్తుంటే వారిని చూసేందుకు,  ఆశీర్వాదం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. 


ఈ అర్ధకుంభమేళాకు కనీసం3-4 కోట్ల మంది భక్తులు వస్తారు కనుక యూపీ ప్రభుత్వం అందుకు తగినట్లుగానే చాలా భారీ ఏర్పాట్లు చేసింది. గంగానదీ తీరం వెంబడి అనేక ఘాట్లు నిర్మించింది. తాత్కాలిక నివాసలా కోసం వేలాదిగా గుడారాలు, విదేశీ పర్యటకుల కొరకు హైక్లాస్ లగ్జరీ కాటేజీలు, వేలాది తాత్కాలిక టాయిలెట్లు, డజన్ల కొద్దీ కొత్తవి తాత్కాలిక వంతెనలు, ఆసుపత్రులు, అంబులెన్సులు, త్రాగునీటి సౌకర్యం, మురుగు కాలువలు, తాత్కాలిక పోలీస్ స్టేషన్లు, వేలాదిమంది భద్రతా సిబ్బంది, వందలాది సిసి కెమెరాలు వగైరాలను ఏర్పాటు చేసింది.


ఇప్పటికే లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ప్రయాగ్ రాజ్‌ నగరం, గంగానదీ తీరప్రాంతాలు నిండిపోయాయి. రేపటి నుంచి కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంటుంది. రైల్వే మరియు విమానయాన సంస్థలు దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు ప్రత్యేకంగా సర్వీసులు నడిపిస్తున్నాయి. ఆధ్యాత్మికత, వినోదాలు, వ్యాపారాలు అన్ని కలగలసి సుమారు రెండు నెలలపాటు ఏకధాటిగా మాహాద్భుతంగా సాగే ఈ కుంభమేళాను కళ్ళతో చూడాల్సిందే తప్ప వర్ణించడం సాధ్యం కాదు.


Related Post