వారిపై చర్యలు తీసుకోండి: షర్మిల ఫిర్యాదు

January 14, 2019


img

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సోమవారం ఉదయం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను కలిసి, కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని తనకు ఓ టాలీవుడ్ నటుడితో అక్రమ సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున గత 5 ఏళ్ళుగా జరుగుతున్న దుష్ప్రచారం మళ్ళీ జోరందుకొందని ఆమె ఫిర్యాదు చేశారు. తనపై ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నవారిని, వారి వెనుకున్నవారినీ కూడా కనుగొని చట్ట ప్రకారం శిక్షించాలని పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను కోరారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ దుష్ప్రచారం వెనుక తెలుగుదేశం నేతలున్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 

షర్మిలతో పాటు ఆమె భర్త అనీల్ కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్‌తో నేతలు వాసిరెడ్డి పద్మ, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు రామకృష్ణా రెడ్డి తదితరులు పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను కలిశారు. 

ఒక వివాహిత మహిళపై సోషల్ మీడియాలో ఈవిధంగా దుష్ప్రచారం చేయడం తప్పు..నేరం కూడా. కనుక ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నవారిని పట్టుకొని చట్టప్రకారం శిక్షించవలసిందే. 

జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల ఇద్దరూ తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెపుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిపై వైజాగ్ విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు, ఆయన కూడా ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా హైదరాబాద్‌ వచ్చేశారు. అప్పుడు ఏపీ పోలీసులు ఆయనను ప్రశ్నించడానికి హైదరాబాద్‌ వచ్చినప్పుడు, తనకు వారిపై నమ్మకం లేదని చెపుతూ జగన్ వారికి సహకరించలేదు. ఇప్పుడు షర్మిల కూడా ఆదేమాట చెప్పారు. 

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఒకవేళ ఆయన ఏపీ ముఖ్యమంత్రి అయితే అదే ఏపీ పోలీసుల సేవలనే ఉపయోగించుకోవాలసి ఉంటుంది తప్ప తెలంగాణ పోలీసులు రారు కదా? ఏపీకి చెందిన ఆమె ముందుగా ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసి వారు చర్యలు తీసుకోకపోతే అప్పుడు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేది.


Related Post