రజత్‌కుమార్‌ను తొలగించాలి: కోదండరాం

January 12, 2019


img

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం  తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ విఫలమయ్యారు. ఆయన  వ్యవహార శైలిపై  మాకు అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలలో ఆయన తెరాసకు అనుకూలంగా  వ్యవహరించినట్లు మాకు అనుమానాలున్నాయి. కనుక లోక్‌సభ ఎన్నికలు ఆయన అధ్వర్యంలో నిర్వహించవద్దని మేము కేంద్ర ఎన్నికల కమీషన్ ను కోరుతాం. రజత్‌కుమార్‌ వ్యవహారశైలిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తాం,” అని అన్నారు.

రాజకీయనాయకులు పార్టీలు ఫిరాయించడంపై స్పందిస్తూ “ప్రస్తుతం పార్టీలకు.. వాటి నాయకులకు ఎటువంటి సిద్ధాంతాలు లేవు. పదవులు, అధికారమే పరమావధిగా భావిస్తూ ఫిరాయింపులు సాగుతున్నాయి,” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జనసమితి ఓడిపోయింది కనుక కాంగ్రెస్ పార్టీలో  విలీనం చేస్తారా? అనే విలేఖరి ప్రశ్నకు సమాధానం  చెబుతూ, “రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలుపోటములు సహజమే. కనుక ఒకసారి ఓడిపోయినంత మాత్రాన్న మా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవలసిన అవసరం లేదు. మా పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని, లోపాలను సవరించుకొని ముందుకే సాగుతాంము. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో మా పార్టీ పోటీ చేస్తోంది,” అని కోదండరాం చెప్పారు.


Related Post