సంక్రాంతికి హైదరాబాద్‌...తరువాత కాంగ్రెస్‌ ఖాళీ?

January 12, 2019


img

సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి లక్షలాదిమంది తమతమ స్వస్థలాలకు బయలుదేరివెళుతుండటంతో పండుగ సమయానికి నగరం ఖాళీ అయిపోతోంది. సంక్రాంతి పండుగ తరువాత కాంగ్రెస్ పార్టీ కూడా ఖాళీ కాబోతున్నట్లు తాజా సమాచారం. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), సుధీర్ రెడ్డి(ఎల్బీ నగర్), పోడెం వీరయ్య (భద్రాచలం), రేగ కాంతారావు (పినపాక), కందాళ ఉపేందర్ రెడ్డి (పాలేరు), జె. సురేందర్ (నిజామాబాద్‌) తెరాసలో చేరేందుకు తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వారు కాక టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మచ్చా నాగేశ్వరరావు (అశ్వరావుపేట) కూడా తెరాసతో టచ్చులో ఉన్నట్లు సమాచారం. 

వీరిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఒకవేళ ఆమెకు మంత్రిపదవి ఇవడం సాధ్యం కాకపోతే ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి టికెట్‌ ఇవ్వాలనే షరతు పెట్టినట్లు తెలుస్తోంది. చేవెళ్ళ తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు కనుక కార్తీక్ రెడ్డికి ఆ సీటు కేటాయించడానికి తెరాసకు అభ్యంతరం ఉండకపోవచ్చు. వీరిలో చాలా మంది సంక్రాంతి పండుగ తరువాత తెరాసలో చేరిపోయే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కనుక సంక్రాంతికి ముందు హైదరాబాద్‌, తరువాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోబోతున్నాయి. 

ఈసారి ఎన్నికలలో సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ఓడిపోవడంతో పార్టీ కళ తప్పింది. పార్టీ నేతలలో నైరాశ్యం, తమ రాజకీయ భవిష్యత్ పట్ల అయోమయం నెలకొని ఉంది. ఈ పరిస్థితులలో ఒకవేళ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోతే ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టమే. 


Related Post