ఇదేనా గుణాత్మక మార్పు? మర్రి ప్రశ్న

January 12, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి సిఎం కేసీఆర్‌, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెస్తానని చెప్పుకొంటూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా ఖూనీ చేశారో ఆయన కలుస్తున్న అన్ని పార్టీలకు లేఖలు వ్రాసి తెలియజేస్తాం. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, సుమారు 30 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని మేము ఎన్నికలకు ముందు పదేపదే హెచ్చరించినా ఎన్నికల సంఘం పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికలు పూర్తయిన తరువాత ఓటర్ల జాబితాలో పొరపాట్లు జరిగాయని ఎన్నికల సంఘం ప్రధానాధికారి స్వయంగా ఒప్పుకున్నారు. ఆ పొరపాటుకు ఎవరు బాధ్యత వహిస్తారు?ఆ పొరపాట్లను సరిదిద్దెందుకు ఏమి చర్యలు తీసుకున్నారు?అసలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సరైన ఓటర్ల జాబితాలు తయారుచేయాలనే ఆసక్తే లేదు. తెరాస చెప్పినట్లు చేసుకుపోతోంది తప్ప స్వతంత్ర సంస్థలా వ్యవహరించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు రెండూ తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. అవి తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి కనుకనే సిఎం కేసీఆర్‌ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకొన్నట్లున్నారు,” అని అన్నారు. 


Related Post