ఇక్కడ ఉత్తమ్...అక్కడ రఘువీరా...

January 11, 2019


img

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని శపధాలు చేశారో అందరికీ గుర్తుండే ఉంటాయి. కానీ ఎన్నికల తరువాత వాటన్నిటినీ గట్టున పెట్టి తన పని తాను చూసుకొంటున్నారు. త్వరలో ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఏపీలో వన్-మ్యాన్ ఆర్మీలాగా పనిచేస్తున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఈరోజు భీకర శపధం చేశారు. 

ఈరోజు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ దేశప్రధాని కావడం ఖాయం. ఆయన ప్రధానమంత్రి కాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ఇక ఈ జన్మలో నా స్వంత ఊరు అనంతపురంలో అడుగుపెట్టను. అంతేకాదు...నా జీవితంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అడుగుపెట్టను,” అని శపధం చేశారు. 

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో ఎవరికీ తెలియదు. గెలిస్తే దేశంలో కాంగ్రెస్‌ నేతలందరికీ సంతోషమే. హామీని నిలబెట్టుకోవడం గురించి అప్పుడు ఆలోచించవచ్చు. కానీ ఓడిపోతే హామీలేదు...శపధమూ ఉండదు. కనుకనే రఘువీరారెడ్డి అంతా ధైర్యంగా కమిట్ అయిపోయినట్లున్నారు. 


Related Post