మరి మహిళా రిజర్వేషన్లు ఎప్పుడు? కవిత

January 11, 2019


img

ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలవారికి విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించడంపై తెరాస ఎంపీ కవిత స్పందిస్తూ, “ఈబీసీ బిల్లును ఏవిధంగానైతే రెండు రోజులలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారో అదేవిధంగా చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదింపజేయాలి. చట్టసభలలో మహిళలకు సముచిత ప్రాధాన్యత లభించినప్పుడే దేశం నిజమైన ప్రగతి సాధించినట్లవుతుంది,” అని ట్వీట్ చేశారు. 

కులాలవారీగా విద్యా, ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్ల కోసం గట్టిగా మాట్లాడే మన రాజకీయ పార్టీలు, మహిళలకు జనాభా ప్రతిపాదికన చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడానికి ఆసక్తి, చొరవ చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో రాజకీయ పార్టీలన్నీ పురుషాధిక్యమైనవే కనుక మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పిస్తే ఆ మేరకు పార్టీలలో పురుష నాయకుల అవకాశాలు కోల్పోతారు. రాజకీయాలలో మగవారి ప్రాభల్యమే ఎక్కువగా ఉంది కనుక కనుక సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, స్వర్గీయ జయలలిత వంటి మహిళానేతలు కూడా తమతమ పార్టీలలో మహిళలకు సముచిత స్థానం, అవకాశాలు కల్పించలేదు. 

మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని మాట్లాడుతున్న తెరాస, గత ప్రభుత్వంలో ఒక్క మహిళను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనాభా ప్రాతిపదికన మహిళా అభ్యర్ధులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించి చిత్తశుద్ధిని చాటుకొని ఉండవచ్చు. కానీ తెరాస కూడా మెజార్టీ స్థానాలు పురుషులకే కేటాయించింది. 

చట్టం చేస్తే తప్ప మహిళలకు సముచిత స్థానం ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ఇష్టపడనప్పుడు మరి ఆ చట్టం చేయడానికి మాత్రం అవి ఎందుకు సహకరిస్తాయి? మహిళల పట్ల రాజకీయ పార్టీల ఆలోచనతీరు మారితే తప్ప చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు సాధ్యం కావని చెప్పవచ్చు. 


Related Post